BJP vs Congress: ‘రాహుల్‌జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్‌ ట్వీట్‌కు భాజపా కౌంటర్‌!

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అనర్హత వ్యవహారంపై జర్మనీ (Germany) స్పందించడం.. అందుకు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ (Digvijaya Singh) ధన్యవాదాలు చెప్పడంతో.. ఈ వ్యవహారంలో రాజకీయంగా కొత్త రగడ మొదలైంది. 

Published : 31 Mar 2023 01:28 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అనర్హత వ్యవహారం దేశీయంగానే గాక.. అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం అగ్రరాజ్యం అమెరికా (USA) రాహుల్ వ్యవహారంపై స్పందించగా..  తాజాగా జర్మనీ (Germany) సైతం రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం అంశాన్ని గమనిస్తున్నామని చెప్పింది. జర్మనీ స్పందనపై ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ( Digvijaya Singh) ట్వీట్‌ వివాదాస్పదమైంది. ‘‘ రాహుల్‌ గాంధీని బాధించడం ద్వారా భారత్‌లో ప్రజాస్వామ్యం ఎలా రాజీపడుతుందో గుర్తించినందుకు జర్మనీ విదేశాంగ శాఖ, రిచర్డ్‌ వాకర్‌కు ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దిగ్విజయ్‌ చేసిన ఈ ట్వీట్‌పై భాజపా (BJP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతుండటంతో కాంగ్రెస్‌ సైతం స్పందించింది. 

రాహుల్‌జీ ధన్యవాదాలు..

దిగ్విజయ్‌ చేసిన ఈ ట్వీట్‌పై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని భారత్ సహించబోదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు. ‘‘భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులను ఆహ్వానించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. విదేశీ జోక్యాలతో భారతీయ న్యాయవ్యవస్థ ప్రభావితం కాదు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని భారత్‌ ఏ మాత్రం సహించబోదు. ఎందుకంటే.. మన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)’’ అని ట్వీట్ చేశారు.

మరో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) సైతం దిగ్విజయ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘దేశానికి ఇది ఎంతో అవమానం. కాంగ్రెస్‌కు, రాహుల్‌ గాంధీకి భారత్‌లోని ప్రజాస్వామ్యం, రాజకీయ, న్యాయపరమైన పోరాటాలపై నమ్మకం లేదు. అందుకే దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను ఆహ్వానిస్తున్నారు. కానీ, ప్రధాని మోదీ నాయకత్వంలోని నవ భారతం విదేశీ జోక్యాన్ని ఏ మాత్రం సహించబోదు’’ అని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలు

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దేశంలో రాజకీయపరమైన సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేష్‌ (Jairam Ramesh) చెప్పారు. ఈ మేరకు ఆయన దిగ్విజయ్‌ పేరును ప్రస్తావించకుండా ట్వీట్‌ చేశారు. ‘‘ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేస్తూ.. ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొవాలని కాంగ్రెస్‌ విశ్వసిస్తోంది. ఈ విషయంలో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ పార్టీకి గట్టి నమ్మకం ఉంది. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీని ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొగలవు’’ అని జైరాం రమేష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు