BJP: ‘మోదీ.. ది బాస్‌’ అంటే రాహుల్‌ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్‌

ప్రధాని మోదీ (PM modi).. ఆ భగవంతుడికే పాఠాలు చెబుతారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Published : 31 May 2023 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశీ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై భారతీయ జనతా పార్టీ మరోసారి విరుచుకుపడింది. ప్రధాని మోదీ (PM modi)ని ప్రపంచ దేశాలు ‘బాస్‌’ అంటే.. రాహుల్‌ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కాషాయ పార్టీ నేతలు  మండిపడ్డారు. విదేశాల్లో అడుగుపెట్టగానే ఆయనలో జిన్నా ఆత్మ చేరుతుందని దుయ్యబట్టారు.

అమెరికా (USA) పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ.. కాలిఫోర్నియాలో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ, భాజపా (BJP)పై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించిన విషయం తెలిసిందే. తనకు దేవుడి కంటే ఎక్కువ తెలుసని ప్రధాని మోదీ అనుకుంటారని, భగవంతుడికే ఆయన విశ్వం గురించి వివరిస్తారని ఎద్దేవా చేశారు. అంతేగాక, భారత అభివృద్ధిపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు, కేంద్రమంత్రులు ధ్వజమెత్తారు.

* ‘‘విదేశీ పర్యటనల్లో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భారత్‌ను అవమానించేలా మాట్లాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రధాని మోదీని అవమానించేందుకు ఆయన దేశ ప్రగతి గురించి ప్రశ్నిస్తున్నారు. దీంతో భారత్‌ను అవమానిస్తున్నారు. మన వృద్ధిని ప్రపంచదేశాలు మెచ్చుకుంటున్న సమయంలో ఆయన దేశ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అనేక దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో మోదీ పాపులర్‌ లీడర్‌ అని చాలా మంది ప్రపంచ నేతలు కొనియాడారు. ‘మోదీ.. ది బాస్‌’ అని ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసించారు. ఇదంతా రాహుల్‌ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారు’’ - కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur)

* ‘‘ఏమీ తెలియని ఓ వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి నిపుణుడిగా మారడం హాస్యాస్పదంగా ఉంది. తన కుటుంబం తప్పా మరే చరిత్ర జ్ఞానం లేని ఓ వ్యక్తి చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. బంగాళదుంపల నుంచి బంగారం వస్తుందని చెప్పిన వ్యక్తి.. సైన్స్‌ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మిస్టర్‌ నకిలీ గాంధీ..! భారత్‌ అంటేనే ఓ సంస్కృతి. మీలా విదేశీ గడ్డపై భారత ప్రతిష్ఠను దిగజార్చకుండా.. ప్రతి భారతీయుడు తమ చరిత్ర గురించి గర్వపడతాడు’’ - కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి (Pralhad Joshi)

* ‘‘రాహుల్‌ గాంధీ విదేశాల్లో అడుగుపెట్టగానే.. ఆయనలో జిన్నా లేదా అల్‌ఖైదాలా ఆలోచించే వారి ఆత్మ ప్రవేశిస్తుంది. ఇందుకు ఆయన చికిత్స తీసుకోవాలి. ఆయన సమస్య ఏంటంటే.. సమ్మిళిత అభివృద్ధి ద్వారా భూస్వామ్య దౌర్జన్యాన్ని ప్రధాని మోదీ నాశనం చేశారన్న నిజాన్ని రాహుల్‌ ఇంకా అంగీకరించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యం అంటే.. ఆయన వారసత్వం అనుకుంటున్నారు’’ - కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వి (Mukhtar Abbas Naqvi)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని