Karnataka: సిద్ధ రామయ్యది తాలిబన్ల సంస్కృతి.. భాజపా నేత వ్యాఖ్యలు

ఉగ్రవాదులు, తాలిబన్లతో పోలుస్తూ కర్ణాటక అధికార భాజపా, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.....

Published : 30 Sep 2021 01:26 IST

బెంగళూరు: ఉగ్రవాదులు, తాలిబన్లతో పోలుస్తూ కర్ణాటక అధికార భాజపా, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. భాజపా నేతలను తాలిబన్లతో పోల్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నలిన్‌కుమార్‌ కటీల్‌ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఓ ఉగ్రవాదితో పోల్చారు. సిద్ధిరామయ్య స్వతహాగా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ‘సిద్ధరామయ్యది తాలిబన్ల సంస్కృతి. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అత్యధిక హత్యలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ దయనీయంగా మారడంతో సహనం కోల్పోయిన ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కటీల్‌ విమర్శించారు. సిద్ధరామయ్య అధికారంలో ఉన్న సయమంలో జరిగిన దీపక్‌రావ్‌, శరత్‌ మదివాలా, ప్రశాంత్‌ పూజారీ లాంటి పలు హత్యలను నలిన్‌కుమార్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 24 మంది హిందూ వర్కర్లు హత్యకు గురైనట్లు పేర్కొన్నారు.

అంతకుముందు సిద్ధరామయ్య ఆదివారం మాట్లాడుతూ.. భాజపా నేతలను తాలిబన్లు, హిట్లర్‌ వారసత్వం అని పేర్కొన్నారు. భాజపా ఓ అబద్ధాల కర్మాగారం అని, వాళ్లు అక్కడ కేవలం అబద్ధాలను సృష్టించి వాటినే మార్కెటింగ్ చేస్తారని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం సైతం అధికార భాజపా ప్రభుత్వంపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్‌ చేతిలో భాజపా ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని దుయ్యబట్టారు. సంఘ్ ఆదేశాల మేరకే పనిచేస్తోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని