Madhya Pradesh Elections: ‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్‌.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్‌!

మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి భాజపా విడుదల చేసిన రెండు జాబితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేరు లేకపోవడం రాజకీయవర్గాల్లో  చర్చనీయాంశమవుతోంది.

Updated : 26 Sep 2023 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల (Madhya Pradesh Elections) వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు భాజపా (BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు విడతల్లో ఇప్పటికే 78 మంది అభ్యర్థులను ప్రకటించింది. జాతీయ స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించుతోంది. ముగ్గురు కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిందంటే వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ ముఖ్యమంత్రి, అందరూ ముద్దుగా ‘మామ’ అని పిలుచుకునే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాబోయే ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత?

ఇది హెచ్చరికేనా?

ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సుదీర్ఘ కాలంపాటు సేవలందించారు. రాజకీయంగా అపార అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి పేరు తొలి రెండు జాబితాల్లో లేకపోవడం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీనికి తోడు కేంద్రమంత్రులను బరిలోకి దించడం, చౌహాన్‌ రాజకీయ భవిష్యత్‌పై ప్రశ్నలు సంధిస్తోంది. భాజపా అధిష్ఠానం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు చౌహాన్‌కు హెచ్చరికగా కొందరు భావిస్తున్నారు. ఒకవేళ త్వరలో విడుదల చేయబోయే అభ్యర్థుల జాబితాల్లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేరు ఉన్నా..  ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉండకపోవచ్చని పార్టీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకే కీలక నేతలను బరిలో దించుతున్నట్లు సమాచారం.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!

భాజపా వ్యూహమే!

పార్టీలోని మరికొన్ని వర్గాలు మాత్రం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను టికెట్‌ కేటాయించబోరన్న వాదనను ఖండిస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే జాతీయ స్థాయి నాయకులను భాజపా అసెంబ్లీ బరిలో దించుతోందని చెబుతున్నారు. భాజపా తాజాగా విడుదల చేసిన జాబితాలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, ఫగ్గన్‌సింగ్‌ కులస్థేల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాలో ఒక్క సిట్టింగ్‌ మంత్రి పేరు కూడా లేకపోవడం గమనార్హం. అభ్యర్థుల విషయంలో బంధుప్రీతిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే భాజపా అధిష్ఠానం ఈ తరహా చర్యలు తీసుకుంటోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్‌ ఎదుట ప్రజల్లో తమకున్న బలాన్ని నిరూపించిన వారికే టిక్కెట్లు కేటాయించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.

‘ఇండియా’ను ఎదుర్కొనేందుకే!

కేంద్రంలో భాజపాను గద్దె దించేందుకు ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ఆయా పార్టీలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సత్తా ఉన్న నాయకులను ఏరికోరి మరీ అధిష్ఠానం బరిలోకి దించుతోంది. ఇదే వ్యూహాన్ని త్వరలో ఎన్నికలు జరగనున్న బెంగాల్‌, పంజాబ్‌, కేరళలోనూ అమలు చేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. అభ్యర్థుల విషయంలో అచితూచి అడుగులు వేస్తోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత నెలలోనే 39మందితో తొలి జాబితాను ప్రకటించిన భాజపా అధిష్ఠానం.. మంగళవారం మరో 39 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

భాజపా ఓటమిని అంగీకరించినట్టే: కాంగ్రెస్‌

మధ్యప్రదేశ్‌ ఎన్నికల బరిలో భాజపా కేంద్ర మంత్రుల్ని దించుతుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్పందించింది. కమలం పార్టీ ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించింది. ఓడిపోతామన్న భయంతోనే జాతీయస్థాయి నాయకుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడుతోందని విమర్శించింది. 2018 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ .. కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాల కారణంగా సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాతోపాటు 24 మంది ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరిపోయారు. దీంతో 2020లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని పొందాలని కాంగ్రెస్‌, అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయంగా ఇరువర్గాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని