Telangana news: రెండు నెలలుగా పాలన స్తంభించింది: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

గత రెండు నెలలుగా రాష్ట్రంలో పాలన స్తంభించిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీలో రోజుకో విషయం బయటకి వస్తోందని మండిపడ్డారు.

Published : 23 Mar 2023 16:55 IST

హైదరాబాద్‌:  గత రెండు నెలలుగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నుంచి రాష్ట్రంలో పాలన జరగడం లేదని విమర్శించారు. కవిత ఈడీ కేసు విషయంలో న్యాయసలహా కోసం ప్రభుత్వం అధికారులను వాడుకుంటోందని అన్నారు.  పోలీసులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు కవిత ఈడీ సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారని అన్నారు.  టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ, పంట నష్టం, నగరంలో కూలుతున్న భవనాల పరిస్థితిని పట్టించుకునే నాథుడే లేదని విమర్శించారు.

‘‘ మంత్రులు అధికారిక ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వపరమైన విషయాలు వదిలేసి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీలో రోజుకో విషయం బయటకి వస్తోంది. తవ్వుతున్న కొద్దీ పేర్లు బయటకి వస్తున్నాయి. ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో పేపర్లు లీకేజీ జరిగాయని తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీలో ఎంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు? ఆయా ఉద్యోగుల ఏజెన్సీలు ఎవరివి? వీరికి సీఎంఓకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు సిట్‌ విచారణలో తేల్చాలి. మంత్రులు రాజీనామా చేసి కవిత కోసం పోరాడాలి.’’ అని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని