Letter War: గవర్నర్‌ Vs సీఎం ఉద్ధవ్‌ లేఖల యుద్ధం.. భాజపా ఏమందంటే?

మహారాష్ట్రలో ఇటీవల ఓ మహిళపై జరిగిన దారుణ హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ బీఎస్‌ కోశ్యారి, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య కొనసాగిన లేఖల యుద్ధంపై భాజపా స్పందించింది. మహిళల భద్రతపై......

Published : 23 Sep 2021 01:39 IST

ముంబయి: మహారాష్ట్రలో ఇటీవల ఓ మహిళపై జరిగిన దారుణ హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ బీఎస్‌ కోశ్యారి, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య కొనసాగిన లేఖల యుద్ధంపై భాజపా స్పందించింది. మహిళల భద్రతపై చర్చించేందుకు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచాలన్న సలహాతో గవర్నర్‌ రాసిన లేఖను ముఖ్యమంత్రి గౌరవించి ఉండాల్సిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ అన్నారు. సీఎం ఇతర రాష్ట్రాలను వేలెత్తి చూపుతున్నారని, అయితే, అక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలో, వద్దో వారు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కానీ ఇక్కడి పరిస్థితులను మెరుగుపరచడంపై ముఖ్యమంత్రి దృష్టిసారించాలని హితవు పలికారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ను గౌరవించాలన్నారు. వచ్చే నెలలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి భాజపా తరఫున సంజయ్‌ ఉపాధ్యాయ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రకాంత్ పాటిల్‌ మీడియాతో మాట్లాడారు.

ఇటీవల ముంబయి నగరంలోని సాకినాక ప్రాంతంలో 34ఏళ్ల మహిళపై దారుణ హత్యాచారం ఘటన విషయంలో గవర్నర్‌, సీఎం మధ్య ‘లేఖ’ల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల భద్రతపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలంటూ గవర్నర్‌ కోశ్యారి కొద్ది రోజుల క్రితం రాసిన లేఖకు సీఎం ఘాటుగా బదులిచ్చారు. దేశంలో మహిళల భద్రత.. వారిపై పెరుగుతున్న దాడులపై చర్చించేందుకు పార్లమెంట్‌ను కూడా ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్రాన్ని కోరాలంటూ గవర్నర్‌కు ప్రత్యుత్తరం పంపారు. అలాగే, గవర్నర్‌ సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ సహా  భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌... తదితర రాష్ట్రాల్లో మహిళలపై దాడులకు సంబంధించిన గణాంకాలను ప్రస్తావిస్తూ అక్కడి సంతేంటని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని