Corona: కరోనా ఎఫెక్ట్‌.. భాజపా ‘జన్‌ఆక్రోశ్‌ యాత్ర’ రద్దు!

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాజస్థాన్‌లో చేపట్టిన జన్‌ ఆక్రోశ్‌ యాత్రను రద్దుచేసుకొంటున్నట్టు భాజపా ప్రకటించింది.

Published : 23 Dec 2022 01:42 IST

దిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్‌(Corona virus) విజృంభిస్తున్న నేపథ్యంలో భాజపా(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది రాజస్థాన్‌ ఎన్నికల(Rajasthan Polls2023)ను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన జన్‌ఆక్రోశ్‌ యాత్ర(Jan Aakrosh yatra)ను రద్దు చేసుకొంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు పెరుగుతుండటంతో రాజస్థాన్‌లో జన్‌ఆక్రోశ్‌ యాత్ర రద్దుచేసుకుంటున్నాం. భాజపాకు ప్రజలే ఫస్ట్.. ఆ తర్వాతే రాజకీయాలు. ప్రజల భద్రత, వారి ఆరోగ్యమే మా ప్రాధాన్యం’’ అన్నారు.

అలాగే,  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న భారత్‌ జోడో యాత్రను మార్నింగ్‌, ఈవెనింగ్‌ వాక్‌గా ఎద్దేవా చేసిన అరుణ్‌సింగ్‌.. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ ఆడుకుంటోందని ఆరోపించారు. రాహుల్‌ యాత్ర ఫ్లాప్‌ షోగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ తన చిల్లర రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని సూచించారు. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రైతు, పాలనా పరమైన సమస్యలపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు ఈ నెల 1న జన్‌ ఆక్రోశ్‌ యాత్రను ప్రారంభించారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించడానికి ముందే భాజపా జన్‌ ఆక్రోశ్‌ యాత్రను మొదలుపెట్టి కొనసాగిస్తోంది.అయితే, తాజాగా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు వస్తున్నందున దాన్ని దృష్టిలో ఉంచుకొని తమ యాత్రను రద్దు చేసుకొంటున్నట్టు అరుణ్‌ సింగ్‌ తాజాగా ప్రకటించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని