Gujarat: గాంధీనగర్‌ మున్సి‘పోల్స్‌’లో భాజపా క్లీన్‌స్వీప్‌

గుజరాత్‌లోని గాంధీనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీఎంసీ) ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు గాను 41 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ ఈసారి కేవలం......

Published : 06 Oct 2021 01:29 IST

భన్వాడ్‌లో కమలనాథులకు షాక్‌!

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీఎంసీ) ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు గాను 41 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా.. ఆప్‌ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం రోజున గాంధీనగర్‌ పురపాలికతో పాటు పలుచోట్ల ఎన్నికలు జరగ్గా.. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. గాంధీనగర్‌లో 11 వార్డుల్లో 44 సీట్లకు గాను మొత్తంగా 162మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

భన్వాడ్‌లో భాజపాకు షాక్‌!

జీఎంసీతో పాటు దేవ్‌భూమి-ద్వారక జిల్లాలోని ఓఖా, భన్వాడ్‌ స్థానాలతో పాటు బనస్కాంత జిల్లాలోని తారా మున్సిపాల్టీకి కూడా ఎన్నికలు జరగాయి. ఓఖాలో 36 స్థానాలకు గాను 34చోట్ల భాజపా విజయం సాధించి తిరిగి అధికారం నిలబెట్టుకుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ రెండుచోట్ల మాత్రమే ప్రభావం చూపగలిగింది. భన్వాడ్‌ మున్సిపాల్టీలో మాత్రం భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 24 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 16చోట్ల సత్తా చాటగా.. 1995 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతూ వస్తున్న భాజపా మాత్రం ఈసారి కేవలం 8 సీట్లకే పరిమితమైపోవడం గమనార్హం.

మోదీపై ప్రజల విశ్వాసానికి సాక్ష్యమిదే..

తాజా ఫలితాలతో భాజపా శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగాయి. ఈ సందర్భంగా గుజరాత్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. భాజపా కార్యకర్తలు ప్రజలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారో చెప్పేందుకు ఈ విజయమే ఓ నిదర్శనమన్నారు. ప్రజలు ఆప్‌ని తిరస్కరించారని.. భాజపాకు ఇదో చారిత్రక ఫలితమన్నారు. గుజరాత్‌ ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పేందుకు ఇదే సాక్ష్యమని తెలిపారు. జీఎంసీ ఎన్నికల్లో 56.24శాతం పోలింగ్‌ నమోదైంది. ఇటీవల విజయ్‌ రూపానీ గుజరాత్‌ సీఎంగా అనూహ్యంగా రాజీనామా చేయడంతో భూపేంద్ర పటేల్‌  కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా అపూర్వ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని