Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభం వేళ.. కార్యాచరణ సిద్ధం చేస్తోన్న భాజపా

మహావికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెబల్‌ నేతలు ప్రయత్నాలు చేస్తోన్న వేళ.. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న భాజపా (BJP) మెల్లగా పావులు కదుపుతున్నట్లే కనిపిస్తోంది.

Published : 28 Jun 2022 16:48 IST

అగ్రనేతలను కలిసేందుకు దిల్లీ వెళ్లిన దేవేంద్ర ఫడణవీస్‌

ముంబయి: శివసేన (Shiv Sena) రెబల్‌ నేతల తిరుగుబాటుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతోన్న ఏక్‌నాథ్‌ శిందే వర్గం త్వరలోనే ముంబయికి చేరుకుంటామని చెబుతోంది. ఇలా మహావికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెబల్‌ నేతలు ప్రయత్నాలు చేస్తోన్న వేళ.. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న భాజపా (BJP) మెల్లగా పావులు కదుపుతున్నట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) నేడు దిల్లీకి వెళ్లడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్ర పరిణామాలపై భాజపా అగ్రనేతలతో చర్చించి తదుపరి కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

అస్సాంలో క్యాంపు వేసిన శివసేన అసమ్మతి వర్గం తమ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో పది మంది స్వతంత్రుల మద్దతు ఉందని చెబుతోంది. త్వరలోనే వారంతా ముంబయి చేరుకొని గవర్నర్‌ను కలిసే అవకాశాలు ఉన్నట్లు భాజపా అంచనా వేస్తోంది. ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్థులందరూ భాజపాకే మద్దతు తెలుపుతున్నామని.. భాజపా కూటమి నేతృత్వంలోనే తదుపరి ముఖ్యమంత్రి ఉంటారని స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా పేర్కొన్నారు. శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా భాజపాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఠాక్రేను డిమాండ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

గత అనుభవాలతో జాగ్రత్త..

ఇలా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం చివరి అంకంలో ఉందని భాజపా వర్గాలు భావిస్తున్నప్పటికీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 2019లో చేసిన తప్పిదం మరోసారి చేయకుండా భాజపా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అప్పట్లో ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టకుండానే ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో కలిసి దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు తన ఎమ్మెల్యేల మద్దతు ఉండదని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేయడంతో కేవలం రెండు రోజుల్లోనే ఫడణవీస్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్‌, శివసేన, ఎస్‌సీపీలు మహావికాస్‌ అఘాడీగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

తాజాగా శివసేన ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అసమ్మతి నేతలపై అనర్హత వేటు వేద్దామని ప్రయత్నించినప్పటికీ.. సుప్రీం కోర్టు ఆదేశాలతో రెబల్‌ ఎమ్మెల్యేలకు జులై 11 వరకు ఊరట లభించింది. ఈ సమయంలోనే ముంబయికి చేరుకొని గవర్నర్‌ను కలిసేందుకు ఏక్‌నాథ్‌ శిందే వర్గం సిద్ధమవుతుండగా.. భాజపా కూడా తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకు దిల్లీలో మంతనాలకు ఉపక్రమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని