మేం గెలిస్తే.. వ్యాక్సిన్‌ ఫ్రీ: భాజపా ట్వీట్‌ 

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని భాజపా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్‌ చేసింది. బెంగాల్‌లో ఈసారి భాజపా ....

Updated : 24 Apr 2021 12:56 IST

బెంగాల్‌ భాజపా ట్వీట్‌.. టీఎంసీ కౌంటర్‌

కోల్‌కతా: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని భాజపా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్‌ చేసింది. బెంగాల్‌లో ఈసారి భాజపా అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ టీకా ఉచితంగానే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. భాజపా ట్వీట్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ మండిపడ్డారు. అవన్నీ తప్పుడు హామీలేనని కొట్టిపారేశారు. బిహార్‌ ఎన్నికల సమయంలోనూ ఉచితంగా టీకా ఇస్తామని భాజపా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికలు పూర్తయ్యాక అక్కడ ఏం జరిగింది? బెంగాల్‌లో మిగిలిన రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యే వరకూ భాజపా ఇదే చెబుతుంది.. ఎవరూ నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, ప్రస్తుత టీకా విధానంపై ఇప్పటికే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి లేఖలు రాశారు. వ్యాక్సిన్‌ విధానం మార్కెట్‌ శక్తులకు అనుకూలంగా, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకా పంపిణీ చేయాలని ఆమె ప్రధానిని కోరారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు వ్యాపారం చేయొద్దని మరో లేఖలో సూచించారు. మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చని కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలందరికీ భాజపా ఉచిత వ్యాక్సిన్‌ హామీ ఇవ్వగా.. ఓటు వేయకపోతే టీకా ఇవ్వరా అంటూ టీకాను రాజకీయం చేయడంపై విపక్షాలు అప్పట్లో భగ్గుమన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని