Kharge: గవర్నర్లను భాజపా కార్యకర్తలుగా వాడుకుంటోంది : ఖర్గే

రాష్ట్ర గవర్నర్లను భాజపా తమ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కొందరు గవర్నర్లు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

Published : 12 Jan 2023 01:34 IST

దిల్లీ: గవర్నర్లను (Governor) పార్టీ కార్యకర్తలుగా భాజపా (BJP) వినియోగించుకుంటోందని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అంతేకాకుండా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఇటీవల కొందరు గవర్నర్లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తోన్న వివాదంపై స్పందించిన ఖర్గే.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

‘విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను తమ పార్టీ కార్యకర్తలుగా భాజపా వినియోగించుకుంటోంది. రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ కార్యాలయాలను కించపరిచేలా వ్యవహరిస్తోంది. ఇటీవల కొందరు గవర్నర్లు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగానికి లోబడే గవర్నర్లు బాధ్యతలు నిర్వర్తించాలి తప్ప చట్టసభ సభ్యులను కించపరచకూడదు. భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సామాజిక, రాజకీయ అశాంతి వాతావరణాన్ని సృష్టించేందుకు దిల్లీ మాస్టర్లు చేస్తోన్న ప్రయత్నాలు ఎంతో ప్రమాదకరం’ అని భాజపాను ఉద్దేశిస్తూ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

కొన్నిరోజులుగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. శాసనసభ సమావేశాల ప్రారంభోపన్యాసం చేసిన గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి.. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలోని కొన్ని పదాలను విడిచిపెట్టడం, మరికొన్ని జోడించడం తాజా వివాదానికి కారణమయ్యింది. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్‌ పూర్తిగా చదవకపోవడం సర్కారు విధానానికి విరుద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌ పేర్కొన్నారు. తమిళనాడుతోపాటు ఇటీవల పలు రాష్ట్రాల్లో గవర్నర్‌కు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య నెలకొన్న వివాదాలపై కాంగ్రెస్‌ అగ్రనేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

21 పార్టీలకు లేఖ..

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి మొదలైన రాహుల్‌ గాంధీ పాదయాత్ర  కశ్మీర్‌లో ముగియనుంది. జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే ముగింపు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ భావ సారూప్యత కలిగిన 21 రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తద్వారా భారత్‌ జోడో యాత్ర సందేశమైన సత్యం, కరుణ, అహింసలను మరింత బలంగా వినిపించవచ్చని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని