Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నికపై భాజపా యూటర్న్‌!

దిల్లీ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిపై భాజపా వెనక్కు తగ్గింది. తొలుత ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు తామూ ప్రయత్నించే అవకాశం లేకపోలేదని పేర్కొన్న కమలదళం.. తాజాగా ఈ విషయంపై యూటర్న్‌ తీసుకుంది. తదుపరి మేయర్ ఆప్‌ నుంచే ఎన్నికవుతారని, తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని శుక్రవారం ప్రకటించింది.

Published : 10 Dec 2022 01:43 IST

దిల్లీ: దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD) మేయర్‌ పదవిపై భాజపా వెనక్కు తగ్గింది. తొలుత ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు తామూ ప్రయత్నించే అవకాశం లేకపోలేదని పేర్కొన్న కమలదళం.. తాజాగా ఈ విషయంపై యూటర్న్‌ తీసుకుంది. తదుపరి మేయర్(Delhi Mayor) ఆప్‌ నుంచే ఎన్నికవుతారని, తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని శుక్రవారం ప్రకటించింది. ‘ఎంసీడీలో భాజపా(BJP) బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది. నగర పరిశుభ్రత, అభివృద్ధి పనులకు మేం ప్రాధాన్యం ఇస్తాం. పాలనలో అవినీతిని అనుమతించం. ఈ విషయంలో ఒక పర్యవేక్షణ సంస్థగా పని చేస్తాం’ అని భాజపా దిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఓ వార్తాసంస్థతో అన్నారు.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ మెజారిటీ సాధించిందేమోగానీ.. మేయర్ ఎన్నిక విషయంలో ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని భాజపా ఇటీవల వ్యాఖ్యానించింది. ‘ఇప్పుడు దిల్లీకి మేయర్‌ను ఎన్నుకోవడం మిగిలింది. ఈ పోటీలో ఎవరు సంఖ్యాబలం సాధిస్తారు.. నామినేటెడ్ కౌన్సిలర్లు ఎవరికి ఓటు వేస్తారు.. అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చండీగఢ్‌లో భాజపా మేయర్‌ ఉన్నారు’ అని భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ సైతం ఓ ట్వీట్ చేశారు. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. మేయర్‌ పదవి మాత్రం భాజపాకు దక్కింది.

చండీగఢ్‌లో ఏం జరిగింది?

గతేడాది డిసెంబరులో చండీగఢ్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లో మొత్తం 35 వార్డులకుగానూ.. ఆప్‌- 14, భాజపా- 12, కాంగ్రెస్‌- 8, శిరోమణి అకాలీదళ్‌- ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఒకరు భాజపాలో చేరారు. చండీగఢ్‌ ఎంపీ(భాజపా)కి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా మేయర్‌ ఎన్నికలో ఓటు హక్కు లభించింది. ఈ క్రమంలో నిర్వహించిన ఎన్నికలో భాజపా అభ్యర్థి‌ సరబ్‌జిత్‌ కౌర్‌.. ఆప్‌ అభ్యర్థి అంజు కత్యాల్‌ను ఒక్క ఓటు తేడాతో ఓడించారు. ఇలా మేయర్‌, సీనియర్‌ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులూ కమలనాథులకే దక్కాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవల వెల్లడైన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 250 వార్డుల్లో 134 గెలుచుకుని మెజారిటీ సాధించింది. భాజపాకు 104, కాంగ్రెస్‌కు కేవలం తొమ్మిది స్థానాలే దక్కాయి. మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు. దీంతో దిల్లీలో 15 ఏళ్ల భాజపా పాలనకు తెరపడినట్లయ్యింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని