Maharashtra Crisis: శివసేనను భాజపా అంతం చేయాలనుకుంటోంది: ఉద్ధవ్‌ ఠాక్రే

శివసేనను భాజపా అంతం చేయాలని చూస్తోందని ఉద్ధవ్‌ ఆరోపించారు....

Published : 25 Jun 2022 10:40 IST

ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) రెబల్‌ ఎమ్మెల్యే వర్గం (Rebel MLAs) ఇంకా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray).. శిందే వర్గం, భాజపా (BJP)పై శుక్రవారం విరుచుకుపడ్డారు. శివసేనను భాజపా అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకెళ్లగలిగారని.. వారిని ఎన్నుకున్న శివసేన (Shiv Sena) మద్దతుదారులను మాత్రం ప్రలోభపెట్టలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి ఆయన పార్టీకి చెందిన కార్పొరేటర్లతో వర్చువల్‌గా మాట్లాడారు. 

సామాన్య శివసేన కార్యకర్తలే తమ సంపద అని.. వారు తనతో ఉన్నంత వరకూ తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోబోనని ఉద్ధవ్‌ (Uddhav Thackeray) అన్నారు. సొంత మనుషులే శివసేన (Shiv Sena)కు ద్రోహం తలపెడుతున్నారని వ్యాఖ్యానించారు. పరోక్షంగా గువాహటిలో మకాం వేసిన శిందే వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలో చాలా మంది ఎన్నికల్లో టికెట్లు ఆశించారు. అయినా, నేను వీరికి (రెబల్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి) కేటాయించాను. మీ కృషి, కష్టం వల్ల గెలిచిన వీరు ఇప్పుడు అసంతృప్తికి గురవుతున్నారు. మీరు మాత్రం ఈ క్లిష్ట సమయంలో పార్టీతో నిలబడ్డారు. మీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు’’ అని కార్పొరేటర్లు, ఇతర నాయకులను ఉద్దేశించి ఉద్ధవ్‌ అన్నారు. 

మహా వికాస్‌ అఘాడీ కూటమి పక్షాల్లో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని ఏక్‌నాథ్‌ శిందేకు గతంలో చెప్పానని ఉద్ధవ్‌ గుర్తుచేసుకున్నారు. ‘‘మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు భాజపాతో చేతులు కలపాలని కోరుతున్నారని శిందే నాతో చెప్పారు. ఆ ఎమ్మెల్యేలను నా దగ్గరకు తీసుకొస్తే చర్చిద్దామని చెప్పాను. భాజపా మమ్మల్ని చాలా దారుణంగా చూసింది. హామీలను నెరవేర్చలేదు. ఈ రెబల్‌ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై కేసులు ఉన్నాయి. ఇప్పుడు వారంతా భాజపాతో వెళితే శుద్ధి అయిపోతారు. ఒకవేళ వారంతా మాతో ఉంటే జైలుకు వెళతారు. ఈ చర్యలు మిత్రుత్వానికి సంకేతమా? ఒకవేళ శివసేన కార్యకర్త ముఖ్యమంత్రి అయితే మీరు భాజపాతో వెళ్లండి. కానీ, ఇప్పుడు మీరు (ఏక్‌నాథ్‌ శిందే) మహా అయితే డిప్యూటీ సీఎం అవుతారేమో. ఆ విషయం నాతో చెబితే నేనే మిమ్మల్ని ఉపముఖ్యమంత్రి చేసేవాణ్ని’’ అని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు.

శివసేన కార్యకర్తలు తనను అసమర్థుడిగా భావిస్తే తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఉద్ధవ్‌ అన్నారు. శివసేన ఒక ఐడియాలజీ అని.. భాజపా హిందుత్వ ఓట్లను ఇంకెవరితోనూ పంచుకోవాలనుకోవట్లేదన్నారు. అందుకే తమ పార్టీని అంతం చేయాలని చూస్తోందన్నారు. హిందుత్వ ఓట్లు చీలొద్దన్న ఉద్దేశంతోనే బాల్‌ ఠాక్రే గతంలో భాజపాతో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేసుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు భాజపాతో కలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఒకవేళ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎంతో కాలం నిలబడదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ వర్గంలో చాలా మంది సంతోషంగా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రెబల్‌ ఎమ్మెల్యేలు కచ్చితంగా గెలవబోరని తెలిపారు. వీలైతే శివసేన ఓటర్లను తీసుకెళ్లండని శిందే, భాజపాకు ఠాక్రే సవాల్‌ విసిరారు. ఇప్పటికీ పార్టీని వీడాలనుకుంటుకున్నవారు వెళ్లిపోవచ్చన్నారు. తాను కొత్త శివసేనను నిర్మించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని