Updated : 31 Mar 2022 05:07 IST

‘పంజాబ్‌లో ఓడించలేక.. కేజ్రీవాల్‌ను భాజపా చంపాలనుకుంటోంది’!

డిప్యూటీ సీఎం సిసోడియా తీవ్ర ఆరోపణలు

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద బీజేవైఎం కార్యకర్తలు దాడులకు దిగడంపై డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తీవ్రంగా స్పందించారు. పంజాబ్‌లో ఓటమిపాలైన భాజపా.. అరవింద్‌ కేజ్రీవాల్‌ని చంపాలనుకుంటోందని ఆరోపించారు. దీనిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. దిల్లీ సీఎం ఇంటి వద్ద భాజపా యువజన విభాగం బీజేవైఎం కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో సిసోడియా మీడియాతో మాట్లాడారు. ‘‘పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేకపోయిన భాజపా.. ఇప్పుడు ఆయన్ను చంపాలనుకుంటోంది. ఈరోజు సీఎం ఇంటి వద్ద జరిగిన దాడి.. పోలీసుల సహకారంతో భాజపా కేజ్రీవాల్‌ను చంపాలని భావిస్తున్నట్టు తేలింది. దీనిపై మేం అధికారికంగా ఫిర్యాదు చేస్తాం’’ అని పేర్కొన్నారు. 

‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై సీఎం కేజ్రీవాల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటి వద్ద భాజపా ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కొందరు ఆగ్రహంతో సీఎం ఇంటి వద్ద బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. 

ఆప్‌, కేజ్రీవాల్‌ అంటే భాజపా భయపడుతోంది!

కేజ్రీవాల్‌ ఇంటిపై భాజపా శ్రేణుల దాడిని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఖండించారు. పంజాబ్‌లో ఆప్‌ చేతిలో ఘోర పరాజయం పాలైనందుకు భాజపా ఆగ్రహావేశాలు స్పష్టంగా కనబడుతున్నాయన్నారు. సీఎం ఇంటి వద్ద పోలీసుల సమక్షంలో జరిగిన ఈ దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. భాజపా ఆప్‌కి, కేజ్రీవాల్‌కి మాత్రమే భయపడుతోందని ఇప్పుడు అర్థమైపోయిందన్నారు. 

భాజపాది నీచ రాజకీయం: చద్దా

మరోవైపు, సీఎం కేజ్రీవాల్‌ ఇంటిపై భాజపా శ్రేణుల దాడుల్ని ఎంపీ రాఘవ్‌ చద్దా తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే వారు బారికేడ్లను విరగ్గొట్టడం, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారన్నారు. పంజాబ్‌లో ఓటమి ఆవేశంలో భాజపా ఇలాంటి నీచ రాజకీయాలకు దిగిందన్నారు. సీఎం ఇంటి వద్ద దాడికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని