Politics: ఆప్‌తో అప్రమత్తమైన భాజపా.. హిమాచల్‌ సీఎం మార్పునకు సిద్ధం..!

హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేందుకు భాజపా సిద్ధమవుతోందంటూ ఆమ్‌ఆద్మీ పేర్కొంది.

Published : 08 Apr 2022 01:52 IST

జోస్యం చెప్పిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేందుకు భాజపా సిద్ధమవుతోందంటూ ఆమ్‌ఆద్మీ పేర్కొంది. ప్రస్తుతం సీఎం జైరాం ఠాకూర్‌ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్‌ ఠాకూర్‌ను నియమించేందుకు పరిశీలిన చేస్తోందని వెల్లడించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు పెరుగుతోన్న ఆదరణ చూసి.. ఓటమి తప్పదని భాజపా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందే హిమాచల్‌లో సీఎంను మార్చేందుకు భాజపా సన్నాహాలు చేస్తోందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు.

‘దిల్లీ పాలనా మోడల్‌తోపాటు అరవింద్‌ కేజ్రీవాల్‌కు పెరుగుతోన్న ఆదరణ చూసి భాజపా భయపడుతోంది. అందుకే హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో అనురాగ్‌ ఠాకూర్‌ను నియమించాలని చూస్తోంది. ఈ విషయంపై మాకు విశ్వసనీయ సమాచారం ఉంది’ అని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు. జైరాం ఠాకూర్‌ పాలనతో తీవ్ర అసంతృప్తితో ఉన్న హిమాచల్‌ ప్రజలు.. వచ్చే అసెంబ్లీలో ఆమ్‌ఆద్మీకి పట్టం కట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు నాయకులను మార్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను భాజపా కప్పిపుచ్చుకోలేదన్నారు. వారు ఏం చేసినా కూడా వచ్చే ఎన్నికల్లో హిమాచల్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు మనీశ్‌ సిసోడియా జోస్యం చెప్పారు.

ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కీలక రాష్ట్రమైన పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. ఇదే ఉత్సాహంతో ఉన్న ఆప్‌.. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపైనా దృష్టి సారించింది. ముఖ్యంగా ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే గుజరాత్‌పై కన్నేసిన ఆమ్‌ఆద్మీ.. ఇప్పటికే అక్కడ ప్రచారం ముమ్మరం చేసింది. 2019లో ఎన్నికలు జరిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం 2024 వరకు గడువు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని