Gujarat polls: గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తాం: అమిత్ షా

వచ్చే నెలలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly election)ల్లో భాజపా గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) అన్నారు.

Published : 16 Nov 2022 01:52 IST

అహ్మదాబాద్‌: వచ్చే నెలలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly election)ల్లో భాజపా గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) అన్నారు. గతంలో ఎప్పుడూ రానన్ని అధికంగా సీట్లు, ఓట్లు సాధించి గుజరాత్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. సనంద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి కనుభాయి పటేల్‌ నామినేషన్‌ కార్యక్రమంలో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం భూపేంద్ర పటేల్‌ నాయత్వంలో గుజరాత్‌లో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. శాంతిభద్రతలు మరింత బలోపేతం కావడంతో పాటు సీఎం భూపేంద్ర పటేల్‌.. ఆర్థికవ్యవస్థను పురోగమనంలో నిలిపారన్నారు. అలాగే, విద్య, వైద్యంతో పాటు అనేక ఇతర రంగాలను అభివృద్ధి చేశారంటూ అమిత్‌ షా ప్రశంసించారు.

గతంలో మోదీ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధి నమూనాను భూపేంద్ర పటేల్‌ ముందుకు తీసుకెళ్తున్నారని అమిత్‌ షా కొనియాడారు. ఈ ఎన్నికల్లో భాజపాకు మంచి మెజార్టీ వస్తే భూపేంద్ర పటేల్‌ మళ్లీ సీఎంగా కొనసాగుతారంటూ నిన్న ఓ సభలో అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 182 సీట్లు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్నాయి. తొలి విడతలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని