Updated : 08 Mar 2022 04:39 IST

UP Exit polls: యోగికే పట్టం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ భాజపానే!

గతం కంటే భారీగా తగ్గనున్న సీట్లు

సమాజ్‌వాదీ పార్టీకి ఈ ‘సారీ’ ప్రతిపక్ష హోదానే

కాంగ్రెస్‌ కంటే బీఎస్పీనే నయం!

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. కుల సమీకరణల్లో ప్రత్యర్థి పార్టీలు ఏకమైనా అవేవీ యోగి విజయాన్ని ఆపలేకపోతున్నాయా? కొవిడ్‌ కట్టడిలో ప్రభుత్వంపై విమర్శలు, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత ఉన్నా కాషాయ వస్త్రధారే మరోసారి అతిపెద్ద రాష్ట్రానికి సీఎం కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్‌!! గతం కంటే ఈ సారి సీట్ల పరంగా సమాజ్‌వాదీ పార్టీ భారీగా పుంజుకున్నా.. సీఎం కుర్చీ మాత్రం అఖిలేశుడికి మరోసారి అందని ద్రాక్షేనని చెబుతున్నాయి. గతంలో రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఏనుగు పార్టీ (బీఎస్పీ) రెండంకెల సీట్లు తెచ్చుకోవడానికి కష్టపడుతుంటే.. ఏళ్ల పాటు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి ఆ చేతికున్న ఐదు వేళ్ల సీట్లూ రావంటున్నాయి తాజా ఎగ్జిట్‌ పోల్స్‌. 403 స్థానాలకు యూపీలో ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల సంగ్రామంలో భాజపాదే అధికారమని ఆయా సంస్థలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 312 స్థానాల్లో గెలుపొందిన భాజపాకు మరోసారి ఓటర్లు పట్టం కట్టనున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అయితే, గతంలో కంటే 100 వరకు స్థానాలు తగ్గొచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అప్నాదళ్, నిషాద్‌ పార్టీలకు మంత్రి పదవులిచ్చి.. ఆ పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లినా కమలనాథులకు ఈ సారి మెజారిటీ (202)కి కొన్ని సీట్లు మాత్రమే అధికంగా రానున్నాయని చెబుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో ఎన్నికలకు వెళ్లి చతికిలపడిన సమాజ్‌వాదీ పార్టీ (47).. ఈ సారి కుల సమీకరణల్లో భాగంగా ఆర్‌ఎల్‌డీ, అప్నాదశ్‌ (కె), ఎస్‌బీఎస్‌పీతో జట్టుకట్టింది. అయితే, గతంతో పోలిస్తే దాదాపు 100 సీట్లకు పైగా పెరిగినా అధికారానికి ఆమడ దూరంలోనే ఎస్పీ నిలిచిపోతుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ సైతం అటూ ఇటుగా పదికి పైచిలుకు స్థానాలు సాధిస్తుందని చెబుతున్నాయి. హస్తం పార్టీకి గత ఎన్నికల్లో ఏడు స్థానాలు రాగా.. ఈ సారీ పదిలోపే వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొంటున్నాయి.

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలివీ..

  • భాజపాకు ఈ సారి అధికారంలోకి వస్తుందని సీఎన్‌ఎన్‌, పీ మార్క్, పోల్‌స్ట్రాట్‌, మ్యాట్రిజ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అన్ని సంస్థలూ భాజపాకు 210కి పైగా స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. ఒక్క ఆత్మసాక్షి మాత్రమే 138-140 స్థానాలు వస్తాయని, భాజపా అధికారానికి దూరమవుతుందని పేర్కొంది.
  • సమాజ్‌వాదీ పార్టీ ఈ సారి 130 నుంచి 160 స్థానాల వరకు గెలుచుకుంటుందని పీ మార్క్‌, మ్యాట్రిజ్‌, సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18, పోల్‌స్ట్రాట్‌ అంచనా వేశాయి. ఆత్మసాక్షి మాత్రమే 235-240 స్థానాలు తెచ్చుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది.
  • బీఎస్పీకి ఈ సారి రెండంకెల స్థానాలు దాటితే ఎక్కువ అన్నట్లుగా ఎగ్జిట్‌పోల్స్‌ తమ అంచనాల్లో పేర్కొన్నాయి. కనిష్ఠంగా ఏడు స్థానాలు గరిష్ఠంగా 24 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.
  • కాంగ్రెస్‌ పార్టీకి 10 స్థానాలు కూడా రావడం కష్టమేనని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 అయితే ఒక్క సీటూ గెలుచుకోదని పేర్కొనడం గమనార్హం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని