Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా

భోపాల్‌లో పది అంతస్తుల్లో నిర్మించబోతున్న భాజపా నూతన కార్యాలయానికి జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 200లకు పైగా సీట్లలో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.

Published : 27 Mar 2023 01:38 IST

భోపాల్‌: ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(MadhyaPradesh assembly polls)నూ తామే విజయం సాధిస్తామని భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విశ్వాసం వ్యక్తంచేశారు. మొత్తం 230 సీట్లకు గాను తమ పార్టీ 200లకు పైగా స్థానాలను గెలుచుకుంటుందన్నారు. భోపాల్‌లో భాజపా అధునాతన హంగులతో 10 అంతస్తుల్లో నిర్మించే నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  భాజపా కార్యాలయం పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థానంలో పది అంతస్తుల్లో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో నడ్డా పాల్గొన్నారు. ఈ భవనం డీపీఆర్‌పై తుది నిర్ణయం తీసుకున్నాకే నిర్మాణ వ్యయం ఎంత అనేది కాలిక్యులేట్‌ చేయనున్నట్టు భాజపా నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు, రూ.1000 కోట్ల వ్యయంతో ఈ పదంతస్తుల భవనాన్ని నిర్మించనున్నట్టు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దివంగత నేత సుందర్‌లాల్‌ పట్వా సీఎంగా ఉన్న సమయంలో 1991లో భాజపా పాత కార్యాలయ నిర్మాణం జరిగింది.  ఆ తర్వాత 2003లో భాజపా తిరిగి అధికారం చేపట్టి 2018వరకు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు వరుసగా కొనసాగింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సంకీర్ణకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ  జ్యోతిరాధిత్య సింథియా, ఆయన వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో కుప్పకూలిపోయింది. దీంతో మళ్లీ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సీఎం పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది.  2018 నవంబర్‌ నెలాఖరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ ఏ ఒక్క పార్టీకి రాలేదు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 114 సీట్లు రాగా.. భాజపాకు 109 స్థానాలు వచ్చాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్ 116 సీట్లు ఏ పార్టీకీ రాకపోవడంతో స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, తదనంతర పరిస్థితుల్లో కమల్‌నాథ్‌-సింధియా వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో ప్రస్తుతం అధికారం భాజపా చేతుల్లోకి మారింది. భాజపా కొత్త భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ,  కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింథియా, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌పటేల్‌తో పాటు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ తదితరులు హాజరయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు