Petrol:లీటరుపై ₹10లకు పైనే తగ్గించే అవకాశం ఉన్నా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించట్లేదు: కాంగ్రెస్‌

దేశంలో అధిక పెట్రోల్‌(Petrol), డీజిల్‌(Diesel) ధరలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ(Congress party) మరోసారి కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టింది.

Published : 02 Dec 2022 01:32 IST

దిల్లీ: దేశంలో అధిక పెట్రోల్‌(Petrol), డీజిల్‌(Diesel) ధరలు కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ(Congress party) మరోసారి కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా భాజపా దోపిడీ మాత్రం కొనసాగుతోందని ధ్వజమెత్తింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రూ.10లకు పైగా తగ్గించే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా తగ్గించట్లేదని కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ట్వీటలు చేశారు. ‘‘మే 16, 2014 నాటికి బ్యారెల్‌ ముడి చమురు ధర 107.09 అమెరికా డాలర్లుగా ఉండగా.. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.71.51లు, లీటరు డీజిల్‌ ధర రూ.57.28లుగా ఉండేది. కానీ 2022 డిసెంబర్‌ 1 నాటికి బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 87.55 డాలర్లుగా ఉంటే.. లీటరు పెట్రోల్‌ ధర రూ.96.72, లీటరు డీజిల్‌ ధర రూ.89.62లుగా ఉంది. ప్రపంచ ముడి చమురు ధరలు పది నెలల కనిష్ఠానికి చేరినా.. భాజపా దోపిడీ మాత్రం గరిష్ఠస్థాయిలో ఉంది’’ అంటూ ఖర్గే ట్వీట్‌ చేశారు. 

ప్రపంచ ముడి చమురు ధరలు 25శాతం తగ్గినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్క రూపాయి కూడా తగ్గించలేదంటూ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. మరోవైపు, అధిక ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధలు పడుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పన్నుల ద్వారా డబ్బులు వసూలు చేయడంలో బిజీగా ఉన్నారన్నారు. గత ఆరు నెలల్లో ప్రపంచ ముడి చమురు ధర 25శాతం మేర తగ్గిందని పేర్కొన్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుపై రూ.10లకు పైనే తగ్గించవచ్చని.. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయీ తగ్గించడంలేదని మండిపడ్డారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని