బెంగాల్‌లో భాజపాకు మరో షాక్‌.. సొంతగూటికి మాజీ మంత్రి!

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి పయనమవుతున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజీవ్‌ బెనర్జీ భాజపాను వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

Published : 01 Nov 2021 01:08 IST

అగర్తల: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి పయనమవుతున్నారు. తాజాగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజీవ్‌ బెనర్జీ భాజపాను వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాజీవ్‌ బెనర్జీ తృణమూల్‌ను వీడి భాజపాలో చేరారు. ఇటీవలే ఆయనకు భాజపా జాతీయ కార్యవర్గంలో సైతం చోటు కల్పించారు. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన భాజపా కార్యక్రమాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో భాజపాలో చేరొద్దని దీదీ వారించినా తాను వినలేదని సొంతగూటికి చేరిన సందర్భంగా రాజీవ్‌ పేర్కొన్నారు. ఆమె మాట వినకుండా ఆ పార్టీలో చేరినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందానని చెప్పారు. భాజపా విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాల్లో తాను ఇమడలేనని గ్రహించానన్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత దూషణలకు దిగొద్దని పలుమార్లు భాజపా అధినాయకత్వానికి సూచించినా తన మాట వినలేదని చెప్పారు. చిన్నపాటి అపార్థం వల్లే అప్పట్లో తాను పార్టీ వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని