Mamata Banerjee: అది ప్రజాతీర్పు కాదు.. ‘పగటి కలలు’ మానండి: భాజపా నేతలకు మమత హితవు

నాలుగు రాష్ట్రాల్లో భాజపా సాధించిన విజయం నిజమైన ప్రజాతీర్పు కాదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Published : 11 Mar 2022 20:20 IST

కోల్‌కతా: నాలుగు రాష్ట్రాల్లో భాజపా సాధించిన విజయం నిజమైన ప్రజాతీర్పు కాదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికల యంత్రాంగం సాయంతోనే భాజపా నేతలు ఓట్లను దండుకొన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతపై మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్‌ కోసం ఎదురు చూడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఉద్ఘాటించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన దీదీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఈ విధంగా స్పందించారు.

‘భాజపా గొంతెత్తి అరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కొన్ని సీట్లలోనే గెలుపొందారు. ఈ విజయం కూడా ప్రజలు ఇచ్చిన వాస్తవ తీర్పు కాదు. ఓట్లను కొల్లగొట్టేందుకు ఎన్నికల యంత్రాంగాన్ని దారుణంగా వినియోగించుకున్నారు. ఇలా ఓట్లు కొల్లగొట్టడం వల్లే అఖిలేశ్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ) పార్టీ ఓటమి చెందింది. ప్రజాతీర్పు వల్ల కాదు’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయం 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రతిబింబిస్తోందని భాజపా నాయకులు చెప్పుకోవడాన్ని ఆమె తోసిపుచ్చారు. భాజపా అటువంటి పగటికలలు మానేయాలంటూ చురకలు అంటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరుపై పశ్నించగా.. ఏం చేయాలనుకుంటున్నారో వాళ్లే నిర్ణయించుకోవాలి. భాజపాను ఓడించాలంటే విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి రావాల్సి ఉందని భావిస్తున్నా. కాంగ్రెస్‌ కోసం వేచిచూడాల్సిన అవసరం లేదంటూ మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని