Yediyurappa: బొమ్మైకి నేనిచ్చే సలహా అదే..  అందులో నా జోక్యం ఉండదు!

కర్ణాటక కొత్త కేబినెట్‌లో మంత్రుల ఎంపిక విషయంలో తన జోక్యం ఉండదని భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప పునరుద్ఘాటించారు. పార్టీ బలోపేతం కోసం తన కృషి కొనసాగుతుందన్నారు......

Published : 31 Jul 2021 01:07 IST

చామరాజనగర్‌: కర్ణాటక కొత్త కేబినెట్‌లో మంత్రుల ఎంపిక విషయంలో తన జోక్యం ఉండదని భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప పునరుద్ఘాటించారు. పార్టీ బలోపేతం కోసం తన కృషి కొనసాగుతుందన్నారు. పార్టీ అధినాయకత్వంతో సంప్రదించి కొత్త మంత్రులను ఎంపిక చేసే పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకే ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల తన రాజీనామా వార్తతో కలత చెంది గుండ్లుపేట తాలూక బొమ్మలపుర గ్రామానికి చెందిన రవి అనే అభిమాని ఆత్మహత్యకు పాల్పడగా.. అతడి కుటుంబాన్ని యడియూరప్ప శుక్రవారం పరామర్శించారు. ఆత్మహత్య ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి రూ.5లక్షల సాయం అందజేశారు. రవికి తల్లి, ఇద్దరు సోదరిలు ఉన్నారని, అతడికి వివాహం కూడా జరగలేదన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకొనేందుకు మరో రూ.5లక్షలు బ్యాంకులో జమచేస్తానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. ‘‘బసవరాజ్‌ బొమ్మై ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నారు. కొద్ది రోజుల్లో ఆయన కేంద్ర నాయకత్వంతో చర్చించి కొత్త కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో నా జోక్యం ఉండదు. ఎలాంటి సూచనలు చేయను. ఇందులో బొమ్మైకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. బాగా పనిచేయాలనే కొత్త సీఎంకు నేను ఇచ్చే సలహా. ఇప్పటికే పేదలు, అట్టడుగు వర్గాలకు సాయం చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు’’ అని చెప్పారు.

2019లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి బయటకు వచ్చి భాజపా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేల పరిస్థితిపై విలేకర్లు ప్రశ్నించగా..ఆ విషయంపై పార్టీ అధినాయకత్వంతో చర్చించి బొమ్మై నిర్ణయం తీసుకుంటారన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించనున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తానని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు హామీ ఇచ్చానన్నారు. వచ్చే ఎన్నికల్లో 130 నుంచి 135 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఇప్పటికే చెప్పానన్నారు.  ప్రతివారం ఒక జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తానని, ఈ విషయంపై  వినాయక చవితి రోజున (సెప్టెంబర్‌ 10న) నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

మరోవైపు, సీఎం బసవరాజ్‌ బొమ్మై ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకొనేందుకు దిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  కొత్త కేబినెట్‌లో బెర్త్‌ దక్కించుకొనేందుకు ఆశావహులు తమ లాబీయింగ్‌ను కొనసాగిస్తున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు