Basavaraj Bommai: సీఎం హోదాలో ఇక్కడికి వస్తానని ఊహించలేదు!

కర్ణాటక కొత్త సీఎంగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బసవరాజ్‌ బొమ్మై తొలిసారి.......

Updated : 29 Jul 2021 17:20 IST

త్వరలో కేబినెట్‌ మంత్రులను ఎంపిక చేస్తామన్న బొమ్మై 

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బసవరాజ్‌ బొమ్మై తొలిసారి హుబ్బళ్లి నగరంలో పర్యటించారు. తాను ఇక్కడే పుట్టి, పెరిగానని, చాలా మంది స్నేహితులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఎక్కువగా ఇష్టపడే నగరమిదేనన్నారు. ఈ నగరం అభివృద్ధికి చేయాల్సిందల్లా చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రత్యేక విమానంలో హుబ్బళ్లి విమానాశ్రయంలో దిగిన ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలతో ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆ జన సమూహాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. ఈ సందర్భంగా బొమ్మై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో హుబ్బళ్లిలో అడుగుపెట్టే రోజును తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తనపై ఈ పెద్ద బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా పెట్టారని, యడియూరప్ప కూడా ఆశీర్వదించారని తెలిపారు.

త్వరలోనే  కొత్త కేబినెట్‌ సభ్యులను ఎంపిక చేయనున్నట్టు బొమ్మై వెల్లడించారు.  భాజపా జాతీయ నాయకత్వంతో చర్చల అనంతరం కొత్త జట్టును ఎంపిక చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా ఆశీస్సులు తీసుకొనేందుకు శుక్రవారం దిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లోనే మరోసారి అపాయింట్‌మెంట్‌ తీసుకొని వాళ్లను కలిశాక.. రాష్ట్రంలో కొత్త కేబినెట్‌ కూర్పుపై చర్చించి మంత్రులను ఎంపిక చేస్తామని చెప్పారు.

మరోవైపు,  బసవరాజ్‌ బొమ్మై గురువారం ఉత్తర కన్నడ జిల్లాలో పర్యటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించనున్నారు. ఉత్తర కన్నడ జిల్లాకు హుబ్బళ్లి మీదుగా వెళ్తూ మధ్యంలో అమర్గోల్‌ వద్ద తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించి నివాళులర్పించారు. అంతకముందు ఆయన హుబ్బళ్లిలోని ఆరెస్సెస్‌ కార్యాలయమైన కేశవ్‌ కుంజ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుబ్బళ్లి-ధార్వాడ్‌లపై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తంచేశారు. ఈ జంట నగరాల్లో మౌలిక, పారిశ్రామికాభివృద్ధికి నిజాయతీగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని