Bhatti Vikramarka: ఏపీలో ఏడు మండలాల విలీనానికి భారాస, భాజపాలే కారణం

రైతుభరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు.

Published : 04 Jul 2024 03:58 IST

ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి, సీఎస్‌ శాంతికుమారి 

ఈనాడు, హైదరాబాద్‌: రైతుభరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతుభరోసా పథకం కింద ఎవరికి సాయం అందించాలన్న అంశంపై ప్రజల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉపసంఘం త్వరలో సభలు, సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తాం. రైతుబంధు సొమ్ము ఇవ్వడం లేదని భారాస నేత హరీశ్‌రావు చెబుతున్న కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మరు. పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుంది.

రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం

ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశాం. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీసు శాఖలు అత్యంత పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నాయి. 

చంద్రబాబు, రేవంత్‌ గురుశిష్యులు కాదు..

చంద్రబాబు, తాను సహచరులం తప్ప.. గురుశిష్యులం కాదని రేవంత్‌రెడ్డి స్వయంగా ఇంతకుముందే చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాల గురించి ఈ నెల 6న ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు ఎజెండాను రూపొందిస్తున్నాం. విభజన చట్టంలో ఏడు మండలాల విలీన అంశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారాస అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం ఆర్డినెన్స్‌ తెచ్చి.. వాటిని ఏపీకి అప్పజెప్పింది. ఆ ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడానికి భారాస, భాజపాలే కారణం. చిత్తశుద్ధి ఉంటే భారాస అధికారంలో ఉన్నప్పుడు వాటిని వెనక్కి తీసుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు?’’ అని భట్టివిక్రమార్క ప్రశ్నించారు.

తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశ ఏర్పాట్ల పరిశీలన

విభజన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 6న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ కానున్న నేపథ్యంలో.. సమావేశం ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారితో కలిసి భట్టివిక్రమార్క బుధవారం పరిశీలించారు.


జెన్‌కో ద్వారానే రామగుండంలో విద్యుత్తు కేంద్రం నిర్మించాలి
ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతి

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రామగుండంలో ఉన్న జెన్‌కో విద్యుత్‌ కేంద్రాన్ని మూసివేస్తే.. అక్కడే 800 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం నిర్మించాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరింది. బుధవారం ఉప ముఖ్యమంత్రిని కలిసిన జేఏసీ నేతలు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అక్కడ జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్తు కేంద్రం ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మరోవైపు ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.3,392 కోట్లు రావాల్సి ఉందని.. 6న జరగబోయే ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు, కో కన్వీనర్‌ బీసీ రెడ్డి, వైస్‌ఛైర్మన్‌ అనిల్‌కుమార్, ఇతర ప్రతినిధులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని