TG News: పోచారం ఇంటి వద్ద ఆందోళన.. బాల్క సుమన్‌, పలువురు భారాస నేతలు అరెస్టు

భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 21 Jun 2024 16:09 IST

హైదరాబాద్: భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం మాజీ శాసనసభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. పోచారం సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటున్న సమయంలో ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. కొందరు భారాస శ్రేణులు పోచారం ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాల్క సుమన్‌, టీఆర్‌ఎస్‌యూవీ నేత గెల్లు శ్రీనివాస్ తదితరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టుకు తరలిస్తున్న క్రమంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద భారాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  

మరోవైపు మాజీ శాసనసభాపతి నివాసం వద్ద జరిగిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం ఉన్నప్పుడే పోచారం ఇంటి వద్దకు భారాస నేతలు చొచ్చుకురావడం కలకలం రేపింది. భారాస కార్యకర్తలు వస్తుంటే అక్కడున్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌ కుమార్‌, సీఎం ముఖ్య భద్రతాధికారి గుమ్మి చక్రవర్తి అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను పరిశీలించి ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని