Jagadish Reddy: విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్‌ రెడ్డి

అసంబద్ధమైన విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వైదొలుగుతారని తాము భావిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు.

Published : 16 Jun 2024 15:27 IST

హైదరాబాద్‌: అసంబద్ధమైన విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి వైదొలుగుతారని తాము భావిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ వాదిగా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిపై సంపూర్ణ గౌరవం ఉందని.. కానీ, ఆయన కమిషన్ చైర్మన్‌గా మారాక అభిప్రాయాలు మారాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై తాము అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్, భాజపా నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్సీ ముందు కాంగ్రెస్, భాజపా నేతలు తమ వాదనలు వినిపించారని పేర్కొన్నారు. ఏ విచారణకైనా సిద్దమని సవాల్ చేశామన్న జగదీశ్‌ రెడ్డి.. కమిషన్ పాత్రపై భారాస అధినేత కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. విచారణ చేసే అర్హత కమిషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్‌ లేఖ రాసినట్లు తెలిపారు.

‘‘ఇచ్చిన గడువు ప్రకారం మేం సమాధానం ఇద్దామని అనుకున్నాం. కానీ.. కాంగ్రెస్, భాజపా నేతల అభిప్రాయాలను జస్టిస్‌ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎలా చెప్తారు? ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమిషన్లు రద్దు అయ్యాయి. ఈఆర్సీ స్వతంత్ర కమిషన్.. అది ఇచ్చిన తీర్పు ఫైనల్ అవుతుంది కానీ, కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు. 15వ తేదీ వరకు కేసీఆర్‌కు సమయం ఇచ్చి 11వ తేదీన జస్టిస్‌ నరసింహారెడ్డి మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేశారు?తెలంగాణ సమాజానికి నిజాలు చెప్పడానికి కేసీఆర్ లేఖ రాశారు.

ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. కమిషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగింది. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో మేం ఒప్పందం చేసుకున్నాం. ఏమైనా అవినీతి జరిగితే కేంద్రమే నిజానిజాలు బయటపెట్టాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయి. తెలంగాణ మాత్రం రూ.3.90లకు విద్యుత్ కొనుగోలు చేసింది. కేసీఆర్ వివరణ తీసుకున్నాక ఛత్తీస్‌గఢ్‌ వాళ్లను పిలిస్తే బాగుండేది. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదు. 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆర్టీపీసీలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించాం’’అని జగదీశ్‌ రెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని