Minister Jupally: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు భారాస నేతలకు లేదు

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారాస నాయకులకు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 08 Jul 2024 05:39 IST

మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈనాడు, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారాస నాయకులకు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ల స్ఫూర్తిని కేసీఆర్‌ గతంలో తుంగలో తొక్కారని మంత్రి విమర్శించారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. గతంలో భారాసకు శాసనసభలో పూర్తి మెజార్టీ ఉన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఆనాడు తమ పార్టీలో చేర్చుకున్నారు. నైతిక విలువలు ఉండి ఉంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేవారు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని భారాస నాయకులు పదేపదే మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. నిరంజన్‌రెడ్డి రాహుల్‌గాంధీకి లేఖ రాసే బదులు కేసీఆర్‌కు రాసి ఉండాల్సింది. భాజపాతో కుమ్మక్కైనప్పుడు.. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలోకి తొక్కినప్పుడు.. సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమైనప్పుడు కేసీఆర్‌కు నిరంజన్‌రెడ్డి గుర్తుచేసి ఉండాల్సింది. నిరంజన్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, కబ్జాల గురించి ప్రజలకు తెలుసు.. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించారు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ భారాస నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇచ్చిన తెలంగాణను ఆగమాగం చేశారని, భారాస పార్టీకి మనుగడ లేదని కార్యకర్తల భావిస్తున్నారని, అందుకే ఆ పార్టీనీ వీడి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. ‘మళ్లీ ఎన్నికలు పెడితే తామే గెలుస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అనడం ఆయన అవివేకం’ అని ఎంపీ మల్లు రవి ఒక ప్రకటనలో విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని