BRS: శాసన మండలికి ఎమ్మెల్యే కోటా భారాస అభ్యర్థులు వీరే!

శాసనమండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను భారాస ప్రకటించింది. అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. 

Updated : 07 Mar 2023 18:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి  నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిని భారాస ఎంపిక చేసింది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్ ఏర్పాట్లు చూడాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, భారాస ప్రదాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  గవర్నర్‌ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ఎల్లుండి కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

నవీన్‌ కుమార్‌, గంగాధర్‌గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియడంతో.. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నవీన్‌ కుమార్‌కు కేసీఆర్‌ మరోసారి అవకాశం ఇచ్చారు. గతంలో టీచర్‌గా పనిచేసి ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి.. ప్రస్తుతం సీఎం కార్యాలయం ఓస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్‌కు కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. చాలా కాలంగా దేశపతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినప్పటికీ పలు రాజకీయ, సామాజిక సమీకరణల వల్ల గతంలో అవకాశం ఇవ్వలేదు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనువడు చల్లా వెంకట్రామిరెడ్డి ఇటీవలే భారాసలో చేరారు. భారాస విస్తరణలో చల్లాకు కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. 

భిక్షమయ్య గౌడ్‌, దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్ తదితర పేర్లు కూడా ప్రచారం జరిగినప్పటికీ వారికి అవకాశం దక్కలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అభ్యర్థుల విషయంలో భారాస ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి పేరును కేబినెట్ సిఫార్సు చేసినప్పుడు.. గవర్నర్ ఆమోదించలేదు. దీంతో ఇప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై భారాస నేతలు సమాలోచనలు జరుపుతున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు