BRS: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టుకు

కారు గుర్తుపై గెలిచి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. ఈ అంశంపై అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు న్యాయనిపుణులతో చర్చించారు.

Published : 25 Jun 2024 03:56 IST

భారాస నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కారు గుర్తుపై గెలిచి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. ఈ అంశంపై అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు న్యాయనిపుణులతో చర్చించారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ వచ్చిన తీర్పును ప్రాతిపదికగా చేసుకోవాలని, ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుంటే.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని భారాస నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు పార్టీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరడంపై ఇప్పటికే భారాస నేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఉందని భారాస నేతలు పేర్కొన్నారు. సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ భారాస గతంలోనే హైకోర్టును ఆశ్రయించింది. ‘‘ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్‌ అనర్హత అంశంపై విచారణ జరగాల్సి ఉంది. ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాం’’ అని భారాస పేర్కొంది. దానం నాగేందర్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌లపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు పేర్కొంది. 


త్వరలో భారాస ఎల్పీ సమావేశం! 

ఈనాడు, హైదరాబాద్‌: భారాస శాసనసభాపక్ష(ఎల్పీ) సమావేశాన్ని త్వరలో తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే భారాస తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. మరికొందరు కూడా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. మూడు రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావులు భేటీ అయ్యారు. పార్టీ వీడతారనే ప్రచారమున్న ఎమ్మెల్యేలను అక్కడికి పిలిపించి.. అధినేత సమక్షంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆదివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధినేతకు ఆయన వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారాస ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను భారాస ఎల్పీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్టీ నేతలు కబురు పెట్టినట్లు తెలిసింది. వారు అక్కడి నుంచి తిరిగిరాగానే.. ఈ వారాంతంలోపే సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా సమస్యలపై ఉద్యమించడం, ప్రజలను జాగృతం చేయడం, పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేయడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. శాసనమండలిలో భారాస పక్ష నేతను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని