
Politics: యడియూరప్ప ఓ ఎలుక: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. బ్యాంకు పరీక్షలను స్థానిక భాషలో నిర్వహించాలని పోరాటం చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ.. ఆయన్ను ఎలుకతో పోల్చారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘‘ యడియూరప్పను ఆ పార్టీ నాయకులంతా ‘పులి’ అనుకుంటారు.. కానీ ఆయన పులి కాదు ఎలుక. ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట నిలబడాల్సివస్తే... కలుగులోని ఎలుకలా వెనక్కి నక్కుతారు. కర్ణాటక ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడే శక్తి లేకపోతే వెంటనే రాజీనామా చేయాలి’’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
ఐబీపీఎస్ పరీక్షలను కన్నడ భాషలో నిర్వహించకుండా కర్ణాటక ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని సిద్ధరామయ్య ఆరోపించారు. తాజాగా ఐబీపీఎస్ విడుదల చేసిన నోటిఫికేషన్ దీనికి ఉదాహరణ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని బ్యాంకు పరీక్షలను కన్నడలోనూ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 11 జాతీయ బ్యాంకుల్లో 3000 ఖాళీలను భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 407 పోస్టులు కర్ణాటకలో ఉన్నాయి. కేవలం హిందీ, ఇంగ్లీషులో మాత్రమే పరీక్ష నిర్వహించడం వల్ల కన్నడ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని, ఫలితంగా కర్ణాకటలో నిరుద్యోగం పెరిగిపోతోందని సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో భాజపా అధికారంలోకి రాకముందు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించారనీ, ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందీ, ఇంగ్లీషుకే పరిమితం చేస్తూ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారని సిద్ధరామయ్య ఆరోపించారు.