Mayawati: అమిత్‌ షా అలా అంగీకరించడం ఆయన గొప్పతనం..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఇంకా తన ఔచిత్యాన్ని కోల్పోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Published : 24 Feb 2022 01:29 IST

భాజపా అగ్రనేతపై మాయావతి ప్రశంసలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ.. రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకటి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఇంకా తన ఔచిత్యాన్ని కోల్పోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా కొన్ని (ముస్లిం, దళిత) వర్గాల మద్దతు బీఎస్పీకి ఇంకా ఉందని అమిత్‌ షా చెప్పడంపై అటు ఆ పార్టీ అధినేత్రి మాయావతి కూడా స్పందించారు. ఈ విషయంలో అమిత్‌ షాతో ఏకీభవిస్తున్నానన్న ఆమె.. ఈసారి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతోన్న నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లఖ్‌నవూలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ఇటీవల అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘అమిత్‌ షాతో ఏకీభవిస్తున్నాను. ఆయన విశ్లేషణ సరైనదే. వాస్తవాన్ని అంగీకరించడం ఆయన గొప్పతనం. అయితే, మరోవిషయం ఆయనకు చెప్పదలచుకున్నా.. కేవలం దళిత, ముస్లిం ఓట్లే కాకుండా అగ్ర, వెనుకబడిన కులాలకు చెందిన వారి మద్దతు కూడా మాకే ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఈసారి కూడా 300లకు పైగా సీట్లు సాధిస్తామని భాజపా చెప్పుకోవడంపై మాట్లాడిన మాయావతి, అందుకు కేవలం కాలమే సమాధానం చెబుతుందన్నారు.

ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీపై మాయావతి విరుచుకుపడ్డారు. ‘ఆ పార్టీపై ముస్లిం వర్గం ఆగ్రహంతో ఉంది. ఎస్‌పీకి ఓటేస్తే గుండా, మాఫియా రాజ్‌ వస్తుందని అందరికీ తెలుసు. అలాంటప్పుడు వారికెలా ఓటు వేస్తారు? ఎస్పీ నేతల ముఖాలను చూస్తేనే తెలుస్తుంది, వారు అధికారంలోకి రావడం లేదని..’ అంటూ బీఎస్పీ అధినేత్రి పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓ జాతీయ వార్తా ఛానల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో దళిత, ముస్లిం ఓట్లను బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ లాగేసుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రాముఖ్యత ఇంకా పోలేదని, కొన్ని వర్గాల మద్దతు ఉన్న మాట వాస్తవమేనంటూ విశ్లేషించారు. అయినప్పటికీ యూపీలో భాజపాకు ప్రత్యర్థి ఎస్‌పీ మాత్రమే అన్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలను అక్కడి రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తోన్న తరుణంలో రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు సానుకూల వ్యాఖ్యలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని