Mayawati: మాయావతి వారసుడు మేనల్లుడే

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌నే మళ్లీ ప్రకటించారు.

Published : 24 Jun 2024 03:44 IST

ఆకాశ్‌ ఆనంద్‌ పేరును మళ్లీ ప్రకటించిన బీఎస్పీ అధ్యక్షురాలు 

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌నే మళ్లీ ప్రకటించారు. పార్టీ జాతీయ సమన్వయకర్తగా కూడా ఆయన్ను నియమించారు. లఖ్‌నవూలో ఆదివారం బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటన వెలువడింది. మాయావతి సోదరుడు ఆనంద్‌ కుమార్‌ కుమారుడు ఆకాశ్‌. ఆయన్ను తన రాజకీయ వారసుడిగా బీఎస్పీ అధ్యక్షురాలు నిరుడు డిసెంబరులో తొలుత ప్రకటించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సమయంలో (మే 7న) ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాశ్‌ ఇంకా పరిణతి సాధించలేదని అప్పట్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ సీతాపుర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే పార్టీలో పూర్తి పరిణతితో పనిచేసేందుకు ఆకాశ్‌కు మాయావతి మళ్లీ అవకాశమిచ్చారని బీఎస్పీ తాజా ప్రకటనలో పేర్కొంది. ఆయన మునుపటిలా పార్టీలో తన పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. 

ఎన్డీయే సర్కారు ఏ క్షణమైనా స్థిరత్వం కోల్పోవచ్చు: మాయావతి 

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏ క్షణంలోనైనా స్థిరత్వాన్ని కోల్పోవచ్చని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ బలోపేతానికి యుద్ధప్రాతిపదికన కృషిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లఖ్‌నవూలో పార్టీ జాతీయ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్న హామీతో కాంగ్రెస్‌ సహా విపక్ష ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాయని, అందువల్లే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని