Andhra News: అసమానతలు తొలగించేందుకే వికేంద్రీకరణ: బుగ్గన రాజేంద్రనాథ్‌

పరిపాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొగ్గుచూపుతుందో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభ వేదికగా మరోసారి వివరించారు.

Updated : 24 Mar 2022 18:57 IST

అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొగ్గుచూపుతుందో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభ వేదికగా మరోసారి వివరించారు. 3 రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత మరోసారి పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘ చర్చ జరిగింది. 1910 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి ప్రసంగం చేశారు.

సమానత్వంపై ప్రభుత్వానికి బాధ్యత ఉంది..

‘‘రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుంది. అందులోనే ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయి. ఎవరి హక్కులు ఎవరూ లాక్కోకూడదు. వెనుకబడిన జిల్లాల్లో తాగునీరే లేని పరిస్థితి. అన్ని రంగాల్లోనూ ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. తెలంగాణ కన్నా ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది.  వెనుకబడిన జిల్లాల్లో అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. అనంతపురం కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర దర్భిక్షం ఉంది. దాదాపు 70వేల మంది కుప్పం వాసులు వలస వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో సమానత్వంపై ప్రభుత్వానికి ఎంతో బాధ్యత ఉంది’’ అని బుగ్గన వివరించారు.

శ్రీబాగ్‌ ఒప్పందంలోనే చెప్పారు...

‘‘శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకునేటప్పుడు ఉన్న పెద్దలు ఎంతో ఆలోచించి చేశారు. నీటిపారుదలకు సంబంధించి తుంగభద్ర, కృష్ణా జలాలు, దానిపై కట్టే ప్రాజెక్టుల ద్వారా మొదటి 10 సంవత్సరాలు వెనుకబడిన రాయలసీమకు నీరివ్వాలని పేర్కొన్నారు. అవసరమైతే మరి కొన్నేళ్లు ఇవ్వాలని కూడా సూచించారు. విశాఖపట్నం కేంద్రంగా అప్పటికే ఉన్న యూనివర్సిటీకి అనంతపురంలో బ్రాంచి పెట్టాలని సూచించారు. రాజధాని ఒక చోట ఉంటే హైకోర్టు మరో ప్రాంతంలో ఉండాలన్నారు. అందులో రాయలసీమకు ప్రాధాన్య మివ్వాలని శ్రీబాగ్‌ ఒడంబడికలో తీర్మానం చేసుకున్నారు. ఇలా.. చరిత్ర చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. పాలనలో వీటికి ప్రాముఖ్యత ఉంటుంది. జెంటిల్‌ మెన్‌ అగ్రిమెంట్‌ను తెలంగాణ, ఆంధ్రా వాళ్లు ఎందుకు చేసుకున్నారో చూడాల్సిన అవసరముంది.

ప్రభుత్వ ఖర్చు, ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌, రీజినల్‌ కౌన్సిల్‌ తదితర అంశాలపై 20ఫిబ్రవరి 1956లో దిల్లీలో చేసుకున్న అగ్రిమెంటే జెంటిల్‌ మెన్‌ అగ్రిమెంట్‌. ఆ తర్వాత తెలంగాణ, జై ఆంధ్రా ఉద్యమాలు వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి 8పాయింట్‌ ఫార్ములా తెచ్చారు. జెంటిల్‌మెన్‌ అగ్రిమెంట్‌, 8 పాయింట్‌ ఫార్ములా, 6 పాయింట్‌ ఫార్ములా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ముఖ్య ఘట్టాలు. వీటన్నింటిలోనూ ప్రధానంగా చెప్పేది డెవలప్‌మెంట్‌ కోసం రీజినల్‌ కౌన్సిల్‌ ఉండాలని. వికేంద్రీకరణ అనేది ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తుందంటే.. 1910 నుంచి చరిత్ర చూసుకున్న తర్వాత.. ఏ ఏ ఘటనలు జరిగాయో, వాటికి పెద్దల ఆలోచన మేరకు వికేంద్రీకరణ అవసరమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఎంత తెలుగు వాదన ఉన్నప్పటికీ ఒక సబ్‌ రీజినల్‌ కావాలనే ప్రాంతీయ వాదం వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు అనంతరం.. 2014లో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రీకరణ పరిపాలన చేయాలా? వికేంద్రీకరణ పరిపాలన చేయాలా?అనే విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రీకరణ ఆలోచన చేశారు’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని