Palaniswami: తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిపై కేసు నమోదు

Palaniswami: ఎయిర్‌పోర్టులో షెటిల్‌ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రాజేశ్వరన్‌ అనే ప్రయాణికుడు పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు రాజేశ్వరన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated : 12 Mar 2023 14:14 IST

మధురై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామి (E Palaniswami)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘అమ్మా మక్కళ్‌ మున్నేట్ర కజగం (AMMK) పార్టీకి చెందిన కార్యకర్తపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీద కేసు పెట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో పళనిస్వామి (E Palaniswami) చెన్నై నుంచి మధురైకి వెళ్తున్నారు. శివగంగలో జరగనున్న ఓ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పయనమయ్యారు. ఎయిర్‌పోర్టులో షెటిల్‌ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రాజేశ్వరన్‌ అనే ప్రయాణికుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. పైగా దీన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో ప్రసారం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే పళనిస్వామి వ్యక్తిగత సిబ్బంది రాజేశ్వరన్‌ ఫోన్‌ లాక్కొని తర్వాత పోలీసులకు అప్పగించారు.

మధురై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బస్సులో జరిగిన ఘటనను తెలుసుకొని రాజేశ్వరన్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. దీంతో రాజేశ్వరన్‌.. పళనిస్వామి, శివగంగ ఎమ్మెల్యే సెంథిల్‌నాథన్‌, మాజీ మంత్రి మణికందన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పళనిస్వామిపై రాజేశ్వరన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కూడా మరో పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని