Chandrababu: చంద్రబాబు దార్శనికత రాష్ట్రానికి అవసరం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated : 14 Jun 2024 05:30 IST

ఎక్స్‌ వేదికగా రాజకీయ, సినీ, క్రీడాప్రముఖుల శుభాకాంక్షలు
ధన్యవాదాలు తెలిపిన సీఎం

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో దూసుకుపోనుందని, ఆయన దార్శనికత, అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. ఈ  అయిదేళ్ల పాలన విజయవంతం కావాలని అభిలషించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి చంద్రబాబు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 

 •  ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కచ్చితంగా నమ్ముతున్నా’’

 వెంకయ్యనాయుడు, పూర్వ ఉపరాష్ట్రపతి 

 •  ‘‘చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం మరింత పటిష్ఠమవుతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి భాగస్వామ్యంలో ఏపీ ప్రగతిపథంలో దూసుకుపోనుంది’’ 

 రాజ్‌నాథ్‌సింగ్, కేంద్రమంత్రి 

 •  ‘‘చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందనుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది’’

 పీయూష్‌గోయల్, కేంద్రమంత్రి 

 •  ‘‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో నవశకం ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు’’

 డా.ఎస్‌ జైశంకర్, కేంద్రమంత్రి 

 •  ‘‘చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య బంధం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆశిస్తున్నా. చంద్రబాబు పాలన సంక్షేమం దిశగా సాగాలి’’

 ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి 

 •  ‘‘ప్రజాసేవ, పాలనలో చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, ప్రధాని మోదీ దార్శనికతతో నిస్సందేహంగా రాష్ట్రం పురోగతి సాధించనుంది. ప్రజలకు మెరుగైన సంక్షేమం అందుతుంది’’

 అనురాగ్‌ఠాకుర్, మాజీ కేంద్రమంత్రి  

 •  ‘‘వాజపేయీ, మోదీ క్యాబినెట్‌లలో గతంలో మంత్రిగా ఉన్న నాకు చంద్రబాబుతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. దేశంలో విద్యుత్‌ రంగ సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధిపై ఆయన సూచనలు విలువైనవి. చంద్రబాబు దూరదృష్టి, అంకితభావం ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలవనుంది’’

  సురేశ్‌ప్రభు, కేంద్ర మాజీమంత్రి 

 •  ‘‘సోదరుడు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం నిజంగా హర్షణీయం. ఆయన నాయకత్వం.. అట్టడుగు వర్గాలకు భరోసాగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా’’ 

 కైలాష్‌సత్యార్థి, నోబెల్‌ పురస్కారగ్రహీత 

 •  ‘‘మీ పదవీకాలం సుస్థిరత, సుపరిపాలనతో సాగాలి. నవశకానికి నాందీ వాచకం కావాలి’’

 సునీతాకృష్ణన్, సామాజికవేత్త 

 •  ‘‘సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్‌కల్యాణ్‌ తదితరుల ప్రమాణస్వీకారానికి హాజరవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’

 గారెత్‌విన్‌ ఓవెన్, బ్రిటిష్‌ డిప్యుటీ హైకమిషనర్‌

 •  ‘‘అమెరికా -భారత్‌ సంబంధాల్లో ఏపీ భాగస్వామ్యం చంద్రబాబు నాయకత్వంలో మరింత పెరగనుంది. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’

 జెన్నిఫర్‌ లార్సన్, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్, హైదరాబాద్‌

 •  ‘‘ఏపీలో ఎన్డీయేకు చారిత్రక విజయాన్ని అందించిన చంద్రబాబుకు అభినందనలు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలోని డబుల్‌ఇంజిన్‌ ప్రభుత్వాలతో రాష్ట్రం ప్రగతిపథంలో సాగుతుంది’’

 తమిళిసై సౌందర్‌రాజన్, తెలంగాణ మాజీ గవర్నర్‌ 

 •  ‘‘30 ఏళ్ల కిత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం అయ్యారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన దూరదృష్టి, అకుంఠిత దీక్ష, పట్టుదల నాయకత్వం తెలుస్తాయి. త్వరలో ఆయన్ను కలుస్తా’’

సోనూసూద్, సినీనటుడు 

 •  ‘‘మీ పాలన విజయవంతం కావాలి. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు’’

 అనిల్‌కుంబ్లే, క్రికెటర్‌ 

 •  ‘‘మీ డైనమిక్‌ నాయకత్వంలో అభివృద్ధి, ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్‌ను చూడబోతున్నందుకు సంతోషంగా ఉంది’’

బోనీకపూర్, సినీనిర్మాత 

 •  ‘‘చంద్రబాబు దార్శనికత, పాలనాదక్షతలో రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుంది. ఆయన విజయవంతంగా తన పాలనా కాలాన్ని పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నా’’

 సత్యదేవ్, నటుడు 

 •  వీరితోపాటు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, జేడీఎస్‌ నేత కుమారస్వామి తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని