Sanjay Raut: ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌.....

Published : 16 Feb 2022 01:42 IST

ముంబయి: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి కేంద్ర సంస్థల్ని భాజపా దుర్వినియోగపరుస్తోందని ధ్వజమెత్తారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులను ఈడీ టార్గెట్‌ చేసిందన్నారు. ముంబయిలోని దాదర్‌ ప్రాంతంలో సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థలను ఉసిగొలిపి ఒత్తిడికి గురిచేసే భాజపా ఎత్తులకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ తలవంచబోవన్నారు. కొందరు భాజపా నేతలు తనను సంప్రదించి తన విధేయతను మార్చుకోవాలన్నారనీ.. లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బెదిరింపులకు గురిచేసినట్టు రౌత్‌ ఆరోపించారు. ఆ తర్వాత తనకు సన్నిహితులైన కొందరిని ఈడీ లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారనీ.. కానీ ఇలాంటి వాటికి తాము లొంగిపోతామని అనుకోవద్దన్నారు. బాల్‌ఠాక్రే నుంచి తాము చాలా నేర్చుకున్నామన్నారు. మహావికాస్‌ అఘాడీ కూటమి నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు వారి కుటుంబ సభ్యులను ఈడీ టార్గెట్ చేసుకుందన్న సంజయ్‌ రౌత్‌.. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని