Rahul Gandhi: కేంద్రం నా సలహా స్వీకరించింది: రాహుల్‌ గాంధీ

రోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిస్‌ బూస్టర్‌ డోసులు ఇవ్వడం ప్రారంభించాలన్న తన సలహాలను కేంద్రం స్వీకరించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.....

Updated : 26 Dec 2021 14:12 IST

దిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిస్‌ బూస్టర్‌ డోసులు ఇవ్వడం ప్రారంభించాలన్న తన సలహాలను కేంద్రం స్వీకరించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ‘‘బూస్టర్‌ డోసుపై నేనిచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇది సరైన నిర్ణయం. వ్యాక్సిన్ల వల్ల వచ్చే రక్షణ ప్రతి ఒక్కరికీ చేరాలి’’ అని ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశంలో వ్యాక్సినేషన్‌ పురోగతిపై డిసెంబరు 22న రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. డిసెంబరు నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యామని గణాంకాల రూపంలో వెల్లడించారు. అందులోనే దేశంలో అత్యధిక మందికి టీకాలు ఇంకా అందలేదని తెలిపారు. అలాగే ఇంకా బూస్టర్‌ డోసులు ఎప్పుడు ఇవ్వడం ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా కేంద్ర సర్కార్‌ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడంతో తన సలహాను కేంద్రం స్వీకరించిందని ఆయన చెప్పుకొచ్చారు.

దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి ఆయన టీవీ ఛానళ్ల ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇంతవరకు సాధించిన పురోగతిని, ఇకపై చేపట్టబోయే చర్యల్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా పిల్లల టీకాలపై ప్రకటన వెలువరించారు. ఇంతవరకు అందరూ బూస్టర్‌ డోసు గురించి మాట్లాడుతుండగా ప్రధాని తొలిసారిగా ‘ప్రికాషన్‌ డోసు’ అనే పదబంధాన్ని ప్రయోగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని