Telangana News: భాజపా వస్తే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం: కేంద్ర మంత్రి హామీ

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా హామీ ఇచ్చారు.

Published : 22 Jan 2023 19:50 IST

ఆదిలాబాద్‌: తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదివాసీలను అందలం ఎక్కిస్తే.. కేసీఆర్‌ నేతృత్వంలోని భారాస సర్కారు వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్‌లోని నాగోబా జాతరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు మెస్రం వంశీయులు సాదర స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అర్జున్‌ ముండా మాట్లాడుతూ.. విశేష చరిత్ర కలిగిన నాగోబా జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు న్యాయం చేసేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‘‘జల్‌, జమీన్‌, జంగీల్‌ ఆదివాసీలకేనంటూ వచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరం. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఆదివాసీలను కేసీఆర్‌ సర్కారు ఏడిపిస్తోంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవుల్లో నివసించే గిరిజన ప్రజలకు అడవులు, పోడు భూములపై సంపూర్ణ అధికారం ఉంటుంది. చట్టాన్ని అనుసరించి అడవిబిడ్డలకు వ్యక్తిగతంగా భూ పట్టాలతోపాటు సామూహికంగా ప్రజలందరికీ హక్కులు కల్పించాలి. ఇలాంటి చట్టాన్ని అమలుచేయకపోవడం ఆదివాసీలకు తీరని నష్టమే. మీరేం ఆందోళన చెందొద్దు. రాష్ట్రంలో రాబోయే భాజపా సర్కార్‌ అటవీ హక్కుల చట్టం అమలు చేసి తీరుతుందని మీకు హామీ ఇస్తున్నాం’’ అని కేంద్రమంత్రి అన్నారు. 

భారాస.. దివాలా తీసిన కంపెనీ: బండి సంజయ్‌

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మొహం చెల్లకనే భారాస పేరుతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. భారాస పూర్తిగా దివాలా తీసిన కంపెనీ అని ఎద్దేవా చేశారు. పంచాయతీల నిధులను సీఎం దారి మళ్లించారని బండి సంజయ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని