Telangana News: కుటుంబ రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు: కిషన్‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 25 Mar 2022 17:14 IST

దిల్లీ:  ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కుటుంబ రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దని సూచించారు. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ .. ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్‌ పంపించబోమని కేసీఆర్‌ అంగీకరించారని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలపై సీఎం కేసీఆర్‌కు నియంత్రణ లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? అని నిలదీశారు. ఎఫ్‌సీఐ వడ్లను కొనదని.. బియ్యం మాత్రమే కొంటుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత ధాన్యం ఉత్పత్తి చేస్తారో కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదన్నారు. చివరి బియ్యపు గింజ వరకు కేంద్రం కొంటుందన్నారు. కేంద్రం బియ్యం కొనుగోలు చేయదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ధాన్యం సేకరణపై రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌ మోడల్‌ను కేసీఆర్‌ అవలంబించాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. భాజపా రైతు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్‌.. రైతులను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని