Telangana News: రైతుల కోసం కొద్ది నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా?: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. దిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Updated : 12 Apr 2022 16:30 IST

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. దిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ రాతపూర్వకంగా తెలిపారా? లేదా? అని ప్రశ్నించారు. బాయిల్డ్‌ రైస్‌ను ఏ రాష్ట్రంలోనూ వినియోగించడం లేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఉచితంగా పంచినా.. ప్రజలు తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోణంలోనే బాయిల్డ్‌ రైస్‌ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపి వేసిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేని సమస్యను సృష్టించారని.. పైగా వాస్తవాలను వక్రీకరించి తెరాస నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అలాగే గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐకి పంపలేదు. ఒప్పందం ప్రకారం పంపాల్సిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఎందుకు పంపలేదు? అనేక విషయాల్లో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ధాన్యాన్ని ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారుగా.. బాయిల్డ్‌ రైస్‌ కాకుండా ముడి బియ్యాన్ని సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుంది. అయినప్పటికీ వడ్లు సేకరించి రా రైస్‌గా ఇస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కేంద్రానికి రా రైస్‌ సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత మేర నష్టం రావొచ్చు. రైతుల కోసం కొద్ది నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా?’’ అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు