Telangana News: తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదు: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌

అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడి బియ్యం (రా రైస్‌) సేకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ వెల్లడించారు.

Updated : 24 Mar 2022 16:55 IST

దిల్లీ: అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడి బియ్యం (రా రైస్‌) సేకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ స్పష్టం చేశారు. అయితే కేంద్రానికి ముడి బియ్యం ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు రా రైస్‌ ఎంత ఇస్తాయో చెప్పాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై దిల్లీలో గోయల్‌ మీడియాతో మాట్లాడారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడి ప్రజలను తెలంగాణ సర్కార్‌ తప్పుదోవ పట్టిస్తోందని.. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ముడిబియ్యం సేకరణకు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంజాబ్‌తో అనుసరిస్తున్న విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. పంజాబ్‌, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమానమేనని.. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం బాసటగా ఉంటుందని పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని