Rammohan Naidu: కేంద్ర నిధుల వినియోగంలో వైకాపా నేతలు విఫలం

కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించడంలో వైకాపా నేతలు విఫలమయ్యారని పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశమందిరంలో అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

Published : 19 Jun 2024 06:09 IST

గత ఐదేళ్లలో రూ.వేల కోట్లు నష్టపోయాం
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు

మాట్లాడుతున్న పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, పక్కన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించడంలో వైకాపా నేతలు విఫలమయ్యారని పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశమందిరంలో అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు వ్యక్తిగత ఎజెండాలు మానుకొని.. ప్రభుత్వ ఎజెండానే పరమావధిగా భావించి చంద్రబాబు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ప్రజాసమస్యలను తీర్చే పనిలోనే ఉండాలని అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్నిశాఖల మంత్రులతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఉపయోగించి రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు తోడ్పాటునందిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో పథకాల రూపంలో రూ.వేల కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చేసిన పొరపాట్లు, అవగాహన లేమి, దృష్టి సారించకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోయామన్నారు. గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎంత నిధులు వినియోగించుకున్నారని పార్లమెంటులో తెలుసుకుంటే దాదాపు అన్ని రాష్ట్రాలు రూ.200 కోట్ల వరకు వినియోగించుకున్నాయని, ఏపీకి చూస్తే సున్నా అని ఉందని, అది చూసి చాలా బాధ కలిగిందన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ నిధుల కోసం పార్లమెంటులో సంబంధితశాఖ మంత్రిని అడిగితే ‘నేను ఏం చేస్తాను.. మీ రాష్ట్రం సక్రమంగా పని చేస్తే నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని’ అని చెప్పారని, అందులో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి స్థానంలోనే ఉందన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. 

అధికారులు ప్రతి ఒక్కరినీ గౌరవించాలి..

అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన వారిని కలెక్టర్‌ నుంచి అటెండర్‌ వరకు, ఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అందరూ గౌరవించాలని చెప్పారు. వచ్చిన వారిని కూర్చోబెట్టాలని సూచించారు. పని చెబితే అవుతుందనుకుంటే చేసి పెట్టాలని, లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అలా కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఎక్కడైనా చిన్న అవమానం జరిగినా తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఐదేళ్లుగా కేంద్ర నిధులు ఒక్క పైసా కూడా వినియోగించుకోలేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. కనీసం కేంద్రం నిధులపై అధికారులు కూడా ముఖ్యమంత్రికి సలహాలివ్వలేకపోయారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని