Mamata banerjee: ఆ పేరుతో ప్రజల్ని కేంద్రం కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది: మమత

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శలు చేశారు. సీఏఏ పేరుతో ప్రజల్ని గందరగోళపరుస్తోందంటూ ఆరోపించారు.

Published : 01 Feb 2023 01:48 IST

మాల్దా: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు పేరిట ప్రజల్ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందని పశ్చిమబెంగాల్‌(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు. బెంగాల్‌ మూలాలున్న మతువా వర్గం ప్రజల్ని తాను, తన పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ చాలా కాలంగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నామని.. ఇప్పుడు భాజపా వచ్చి సీఏఏ(CAA) పేరు చెప్పి వారికి ఓ స్నేహితుడిలా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. సీఏఏ పేరిట కేంద్రం గందరగోళపరుస్తోందని.. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడల్లా సీఏఏ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వారి శ్రేయోభిలాషులమని చెప్పుకొంటోందన్నారు. మాల్దాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.  మతువా వర్గానికి చెందిన ప్రజలు వాస్తవానికి తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లో మతపరమైన అణచివేతలకు గురై అక్కడి నుంచి 1950లలో బెంగాల్‌కు వలసవచ్చిన విషయం తెలిసిందే. 

మాకివ్వాల్సిన రూ.లక్ష కోట్ల బకాయిలు చెల్లించండి: కేంద్రానికి డిమాండ్‌

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించడంలేదని మమత మరోసారి ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు రూ.లక్ష కోట్లు మేర బాకీ ఉందని.. తమ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే, రూ.లక్ష కోట్ల బకాయిలకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. గతంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులు మంజూరు చేయడంలేదంటూ మమత పలుమార్లు కేంద్రంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇకపోతే, బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్‌ జిల్లాల్లో నదీ కోతల్ని కేంద్రం పట్టించుకోవడమే మానేసిందని దీదీ విమర్శించారు. నదీ కోతను అరికట్టడమే ప్రస్తుతం మనముందున్న పెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని