రైతులకు మద్దతు పలికితే దాడులా: రాహుల్‌

ప్రముఖ సినీ నటి తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. రైతులకు మద్దతు తెలుపుతున్న సెలబ్రిటీలపై కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తోందని విమర్శించారు.

Published : 04 Mar 2021 14:37 IST

దిల్లీ: ప్రముఖ సినీ నటి తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. రైతులకు మద్దతు పలుకుతున్న సెలబ్రిటీలపై కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తోందని విమర్శించారు. ఈ విధానం సరైంది కాదంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోంది. రైతులకు, వారి ఉద్యమానికి సెలబ్రిటీలు ఎవరైతే మద్దతు పలుకుతారో వారే లక్ష్యంగా దాడులను చేయిస్తోంది’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌లో విమర్శించారు. ఆ ట్వీట్‌కు #modiraidsprofarmers అంటూ హ్యాష్‌ట్యాగ్‌ చేశారు. కాగా సెలబ్రిటీలపై ఈ ఐటీ దాడులను ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ సైతం తప్పుబట్టారు. సీబీ, ఈడీ, ఐటీ విభాగాల్ని భాజపా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. 

తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ల కార్యాలయాలపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ముంబయి, పుణెల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు చేశారు. 2018లో మూసివేసిన ఫాంటామ్‌ ఫిలిమ్స్‌ పన్ను ఎగవేత కేసులో అనురాగ్‌ కశ్యప్‌తో పాటు, నిర్మాతలు విక్రమాదిత్య మోత్వానీ, వికాస్‌ బెహెల్‌, మధు మంతెనను అధికారులు విచారిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని