
CAA: ‘సీఏఏ అమలుకు దొడ్డిదారి యత్నాలు’
పౌరసత్వం నోటిఫికేషన్‌పై వామపక్షాలు మండిపాటు
దిల్లీ: దేశంలో పౌరసత్వసవరణ చట్టం (సీఏఏ) అమలుకు కేంద్రం దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తోందని వామపక్షాలు ఆరోపించాయి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన మైనారిటీలు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై విమర్శలు గుప్పించాయి. సీఏఏ అమలుకే ఈ ప్రయత్నాలని మండిపడ్డాయి.
సీఏఏ-2019కు సంబంధించి ఇంత వరకు నిబంధనలేవీ రూపొందించలేదని, దానికి సంబంధించి ఎలాంటి గెజిట్ కూడా విడుదల చేయలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కానీ, దొడ్డిదారిన సీఏఏ అమలుకు యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఏఏ రాజ్యాంగబద్ధత అంశం ఇంకా తేలలేదని గుర్తుచేశారు. దీనిపై సుప్రీంకోర్టు తక్షణమే చొరవచూపి ఇటువంటి యత్నాలను అడ్డుకోవాలని ఏచూరి కోరారు. ఓ వైపు కొవిడ్ మహమ్మారితో వందలాది మంది బలౌతుంటే మరోవైపు కేంద్రం తన రాజకీయ ఎజెండా దిశగా ముందుకెళ్లడం ఫాసిస్టు విధానాలకు అద్దం పడుతోందని సీపీఐ కార్యదర్శి డి.రాజా విమర్శలు గుప్పించారు. సీఏఏ నిబంధనలు రూపొందించకుండా ఇలాంటి ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని సీపీఐ-ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకకర్ భట్టాచార్య విమర్శించారు.
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి.. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటూ కేంద్ర హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ముస్లిమేతర మైనార్టీలుగా హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్శీలు, క్రైస్తవులు తదితరులను పేర్కొంది. పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని నిబంధనల కింద ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. 2019లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.