Assembly Elections: నాలుగుసార్లు గెలిచిన మంత్రిని పక్కనబెట్టి.. చాయ్‌వాలాకు టికెట్‌

హిమాచల్‌ప్రదేశ్‌లో కీలకమైన శిమ్లా అర్బన్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున సంజయ్ సూద్‌ పోటీ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఆయన ఓ చాయ్‌వాలా.

Published : 20 Oct 2022 15:45 IST

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు కాషాయ పార్టీ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే కీలకమైన అసెంబ్లీ స్థానంలో నాలుగుసార్లు గెలిచిన మంత్రిని పక్కనబెట్టి.. ఓ చాయ్‌వాలాకు టికెట్ కేటాయించింది.

శిమ్లా అర్బన్‌ శాసనసభ స్థానం నుంచి భాజపా తరఫున సంజయ్‌ సూద్‌ పోటీ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. సంజయ్‌.. శిమ్లాలో చాయ్‌ దుకాణం నడుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి సురేశ్ భరద్వాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి సురేశ్ నాలుగు సార్లు గెలిచినప్పటికీ.. ఈ సారి ఆయనను పక్కనబెట్టి సంజయ్‌కు అవకాశం కల్పించడం గమనార్హం. కాగా.. మంత్రి సురేశ్‌ను కాసుంప్టి స్థానం నుంచి నిలబెట్టింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంపై చాయ్‌వాలా సంజయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘శిమ్లా అర్బన్‌ లాంటి కీలక నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా భాజపా నన్ను నిలబెట్టడం చాలా సంతోషంగా ఉంది. నాలాంటి చిన్న కార్యకర్తకు ఇదో గొప్ప గౌరవం. 1991 నుంచి నేను చాయ్‌ అమ్ముతున్నాను. అంతకుముందు బస్టాండ్‌లో న్యూస్‌ పేపర్లు విక్రయించేవాడిని. అలా వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజులు కట్టి చదువుకున్నా. అప్పుడే నాకు విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)తో పనిచేసే అవకాశం లభించింది’’ అని సంజయ్‌ తెలిపారు.

రాజకీయ నేపథ్యం లేనప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే తపనతో 1980 నుంచే భాజపాతో కలిసి పనిచేస్తున్నట్లు సంజయ్‌ ఈ సందర్భంగా తెలిపారు. సంజయ్‌ గతంలో భాజపా శిమ్లా మండల్‌ అర్బన్‌కు జనరల్ సెకట్రరీగా పనిచేశాడు. ఆ తర్వాత జిల్లాలో పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం భాజపా శిమ్లా యూనిట్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని