Chandrababu: ఇది నా బాధ.. ఆవేదన.. ఆక్రందన: న్యాయమూర్తితో చంద్రబాబు

జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు.

Updated : 22 Sep 2023 11:48 IST

విజయవాడ: జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తన హక్కులను రక్షించాలని.. న్యాయాన్ని కాపాడాలని ఆయన కోరారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబు రిమాండ్‌ ముగియడంతో పోలీసులు ఆయన్ను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీపై న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. 

‘‘45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్ట్‌ చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్‌ చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. ఇది నా బాధ.. నా ఆవేదన.. నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్‌ ఇచ్చారు. నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే .. చట్టాన్ని గౌరవిస్తా. న్యాయం గెలవాలి’’ అని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు.

ఆరోపణలు మాత్రమే.. నేర నిరూపణ కాలేదు: చంద్రబాబుతో న్యాయమూర్తి

అనంతరం చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడుతూ ‘‘మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించొద్దు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేరనిరూపణ కాలేదు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్‌ విధించాం. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశిస్తాం. మీరు 24 వరకు జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉంటారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమే’’ అని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని