Chandrababu: అందరి చరిత్రా నా దగ్గరుంది.. ఎవరూ తప్పించుకోలేరు: చంద్రబాబు

తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రభుత్వాలను చూశారని.. ఎవరూ వ్యక్తిగత దూషణలకు పోలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా లాంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

Updated : 14 Oct 2022 14:14 IST

మంగళగిరి: తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని.. ఎవరూ వ్యక్తిగత దూషణలకు పోలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా లాంటి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వివిధ జిల్లాల న్యాయవాదులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక మార్పులకు తెదేపా నాంది పలికిందని చెప్పారు. న్యాయవాదులకు అవకాశాలు ఇచ్చి గుర్తింపు తెచ్చిన పార్టీ తెదేపా అన్నారు. సమర్థులను నియమించి రాష్ట్ర అభివృద్ధికి తెదేపా ఎంతో కృషి చేసిందని చెప్పారు.

జగన్‌ అప్పుడలా చెప్పి.. ఇప్పుడు చిచ్చుపెడుతున్నారు

‘‘రుషికొండను తవ్వేసి బోడికొండలా చేశారు. ఈ అంశంపై ఓ పక్క కోర్టులో విచారణ జరుగుతుంటే.. మరోపక్కన కొండను తవ్వేస్తున్నారు. పోలవరాన్ని మేం 70 శాతం పూర్తి చేస్తే.. దాన్ని ముంచేశారు. అమరావతి కోసం రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్‌ చేసిన ఘనత తెదేపాది. అలాంటి అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ సరే అన్నారు. చిన్న రాష్ట్రం, విభేదాలు వద్దని అప్పుడు చెప్పి.. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోరాడుతూనే ఉంటాం.. దానికి న్యాయవాదుల సహకారం కావాలి.

దస్తగిరి ప్రాణభయంతో ఉన్నారు..

వివేకా హత్య తర్వాత ఇద్దరు చనిపోయారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ఎంపీ రఘురామపై ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? పోలీసు వ్యవస్థను వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. అందరి చరిత్రా నా దగ్గరుంది.. ఎవరూ తప్పించుకోలేరు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద అధికారి అయినా తప్పించుకోలేరు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని