Chandrababu: ఇది ఆరంభమే.. వచ్చే సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు

రాష్ట్ర అసెంబ్లీ (AP Assembly) చరిత్రలో ఇవాళ చీకటి రోజు అని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 20 Mar 2023 15:17 IST

అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ (AP Assembly) చరిత్రలో ఇవాళ చీకటి రోజు అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలకు గురిచేసినా వెనక్కి తగ్గబోమని.. రాష్ట్ర ప్రజల కోసం భరిస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆరంభం మాత్రమేనని.. వచ్చేది సునామీ అన్నారు. ఆ సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా తరఫున గెలుపొందిన వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలిపి సత్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

రామగోపాల్‌రెడ్డి పులివెందుల పులి

‘‘ముగ్గురు ఎమ్మెల్సీలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని సవాళ్లు వచ్చినా సమర్థంగా ఎదుర్కొన్నాం. ముగ్గురు అభ్యర్థులు, పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయడం వల్లే విజయం సాధించాం. సాంకేతికతను సద్వినియోగం చేసుకున్నాం. భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పులివెందుల పులిగా మారారు. అక్కడ జగన్‌రెడ్డి ఓడిపోయి రామగోపాల్‌రెడ్డి గెలిచారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ కుట్ర చేశారు. బెదిరింపులకు పాల్పడితే గట్టిగా నిలబడి ఎదుర్కొన్నారు. గెలిచిన తర్వాత డిక్లరేషన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. డిక్లరేషన్‌ ఇచ్చే వరకు అక్కడే ఉండాలని సూచించాను. పట్టభద్రుల ఎన్నికల్లోనే కాదు.. ఇక ముందూ మేమేంటో చూపిస్తాం. 

బెదిరిస్తే పారిపోతామనుకుంటున్నారా?

శాసనసభలోనే దాడులు చేసే సంస్కృతిని వైకాపా నేతలు తీసుకొచ్చారు. నా జీవితంలో ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీల సభ్యులపై దాడి చేయించాలనే ఆలోచన చేయలేదు. స్వామి, గోరంట్లపై దాడులు చేస్తారా? మా ఎమ్మెల్యేలపై దాడి చేసి తిరిగి మావాళ్లపైనే ఆరోపణలా? దాడి చేసిన వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. పోలీసులు కేసులు పెడితే భయపడే పరిస్థితి లేదు. బెదిరిస్తే పారిపోతామనుకుంటున్నారా? ఎదురు తిరుగుతాం. విజ్ఞతలేని నాయకుడు సీఎంగా ఉంటే ఇలానే జరుగుతాయి. సభా గౌరవాన్ని మంటగలిపే వ్యక్తి ఈ సైకో జగన్‌. సైకోను ఇంటికి పంపాలంటే ప్రజలంతా ముందుకు రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని