Andhra News: డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్‌ చేతగాని సీఎం జగన్: చంద్రబాబు

గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు గడిచాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 25 Jun 2022 15:35 IST

అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు గడిచాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కూల్చివేతపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఇది కూల్చివేతల ప్రభుత్వమని మండిపడ్డారు. తన విధ్వంస పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ... తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు గడిచిందని వ్యాఖ్యానించారు.

డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్‌ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనని.. రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక స్థాయిని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, దళితుల గూడును, యువత భవితను కూల్చేశారని ఆక్షేపించారు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను చిదిమేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్.. ఈ మూడేళ్ల పాలనలో కట్టింది మాత్రం శూన్యం అని అన్నారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన కొనసాగిస్తూ తన వల్ల ఏమీ కాదని.. తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశారన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా సీఎం జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని